International Womesn Day 2024: ఈ ప్రపంచం మొత్తం కరుణా తప్త హృదయంతో అంజలి ఘటించే ఏకైక మానవతా మూర్తి.. మదర్ థెరీసా(Mother Teresa). సెప్టెంబరు 5న ప్రపంచ దాతృత్వ దినోత్సవం(World Philanthropy Day)గా ఆమెను, ఆమె సేవల(Service)ను ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు కుల, మత, వర్ణ విచక్షణకు అతీతంగా నిర్వహించుకుంటూ.. ఆమెకు దోసిలొగ్గుతాయి. `అమ్మ`గా కీర్తిస్తాయి. దీనికి కారణం.. సేవా స్ఫూర్తి. మానవతా దీప్తి. ``ఒకరికి సాయం చేయాలని, ఎవరో నీదగ్గరకు వస్తారని నువ్వు ఎదురు చూడకు. సాయం కోరుకునే ఆర్తులను వెతుక్కుంటూ.. నువ్వే అడుగులు వేయి`` అన్న గురువు చెప్పిన ఒకే ఒక్క మాట.. ఆమెను సేవాగుణం వైపు మళ్లించింది. ప్రపంచంలోని తాడిత పీడిత ప్రజల కోసం.. రోగాలతో అల్లాడుతున్న బాధామయ బతుకుల్లో దివిటీ వెలిగించడం కోసం నడిచేలా చేసింది. సేవ చేయడంలో శిఖర సమాన స్థాయికి చేరుకునేలా చేసింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మదర్ థెరిసా ప్రస్థానం, ఆమె స్ఫూర్తిపై ప్రత్యేక కథనం.
ఎవరీ మదర్?
ప్రపంచం మొత్తం `అమ్మ`అని పిలుచుకునే మదర్ థెరీసా.. అసలు పేరు `ఆగ్నస్ గోంక్సే బోజాక్ష్యు` ఈమె 1910 ఆగష్టు 26న ఉత్తర మేసిడోనియా(అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యం)లో జన్మించారు. క్రిస్టియానిటీ కావడంతో ఆమె పుట్టిన మరునాడే ఆమెకు జ్ఞానస్నానం(Baptism) చేయించారు. నికోల్లే, డ్రాన్ బోజాక్ష్యు ఆమె తల్లిదండ్రులు. తండ్రి అల్బేనియా దేశ రాజకీయాల్లో నాయకుడిగా ఉండేవారు. తండ్రి మరణం తరువాత తల్లి ఆమెను రోమన్ కేథలిక్(Roman catholic)గా పెంచారు. దీంతో తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథల పట్ల, వారి సేవల పట్ల ఆకర్షితురాలయ్యారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు.
భారత్‌కు రాక ఇలా..
సిస్టర్స్ అఫ్ లోరెటోలో ఉన్న బోజాక్ష్యు.. భారతదేశంలో విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించే బృందంలో ఎంపికయ్యారు. ఈ క్రమంలో మురికి వాడల్లో పిల్లలకు ఇంగ్లీష్ నేర్పేందుకు డార్జిలింగ్ కి వచ్చారు. 1931 మే 24లో ఆమె సన్యాసినిగా మారారు. మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ తెరేసే డి లిసే పేరు మీద తన పేరును థెరీసాగా మార్చుకున్నారు. 1937 మే 14లో తూర్పు కలకత్తాలోని లోరెటో(Loreto) కాన్వెంటు పాఠశాల(School)లో ఉపాధ్యాయురాలి(Teacher)గా చేరారు. ఇలా ఆమె తన ప్రయాణాన్ని భారత్‌లో ప్రారంభించారు.
కష్టాలు చూసి చలించిపోయి..
కలకత్తాలోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరిన థెరీసాకు కేవలం బోధన మాత్రమే ఆనందం ఇవ్వలేదు. తన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలు ఆమెను కదిలించాయి. కష్టాలు, కన్నీళ్లు, రోగుల ఈతి బాధలు ఆమెను చలించిపోయేలా చేశాయి. ముఖ్యంగా 1943లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను, మరణాలను తీసుకురాగా, 1946 ఆగష్టులో ఏర్పడిన హిందూ, ముస్లింల ఘర్షణ మరింతగా బాధించాయి. దీంతో ఈ సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఆమెను ఉపాధ్యాయ వృత్తి నుంచి సేవా రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. "నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివసిస్తూ వారికి సేవ చేయాలి. ఇది ఆ దేవుని ఆజ్ఞ. దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే`` అని త్రికరణ శుద్ధిగా విశ్వసించిన థెరీసా మరుక్షణమే తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. ఆవెంటనే మురికి వాడలలోకి ప్రవేశించారు. ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు. అనాథల, అన్నార్తుల అవసరాలను తీర్చడే పనిగా నిర్ణయించుకున్నారు. ఆమె బృహత్ సంకల్పం స్థానిక అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేశాయి. అయితే.. అనంతర కాలంలో ఆమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. దేశం కాని దేశం.. ప్రజల్లోని కొన్ని వర్గాలు ఆమెను తూలనాడడం వంటివాటిని పంటిబిగువున భరించారు. సేవ చేసేందుకు మాత్రమే నేను పరిమితం అనే భావనను బలంగా విశ్వసించారు. ఇదే ఆమెను తర్వాత కాలంలో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేలా చేసింది.
అలా మొదలై.. ఇలా..
1950 అక్టోబరు 7న థెరీసా వాటికన్ అనుమతితో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు. అదే తరువాత `మిషనరీస్ ఆఫ్ ఛారిటీ`గా రూపొందింది. ఆకలిగొన్న వారు, దిగంబరులు, నిరాశ్రయులు, కుంటి వారు, కుష్టు వ్యాధి గ్రస్తులు ఇలా ప్రతి ఒక్కరినీ ప్రేమించడం, వారికి సేవ చేయడమే తన కర్తవ్యమని ఆమె సమాజానికి సందేశం ఇచ్చారు. ఇది కలకత్తాలో స్వల్ప స్థాయిలో 13 మంది సభ్యులతో మొదలైంది. తర్వాత కాలంలో ప్రపంచ దేశాలకు విస్తరించి ఈ రోజు 4,000కు పైగా సన్యాసినులతో వేల కొద్దీ అనాథ శరణాలయాలు, ఆసుపత్రులు నెలకొల్పి ఉచితంగా కొన్ని చోట్ల అత్యంత తక్కువ ఖర్చుకే సేవలు అందిస్తోంది.
ప్రపంచం అక్కున చేర్చుకున్న క్షణం!
థెరీసా సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు.. ఆమెకు `మదర్` బిరుదును ప్రసాదించాయి. అంతేకాదు.. ఆమె ఏదేశానికి వెళ్తే.. ఆదేశ పౌరురాలిగా గుర్తించే తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఆమె తుదిశ్వాస విడిచిన సెప్టెంబరు 5వ తేదీని(1997లో మరణించారు) ప్రపంచ దాతృత్వ(సేవా) దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇక, భారత దేశం తొలుత పద్మశ్రీ, తర్వాత భారతరత్న పురస్కారాలతో ఆమెకు శిఖర సమానమైన గౌరవాన్ని అందించింది. అమెరికా సహా అనే దేశాల్లోని ప్రధాన వీధుల్లో మదర్ థెరీసా విగ్రహాలు నెలకొల్పారు. ఐక్య రాజ్యసమితిలోని ఒక కట్టడానికి ఆమె పేరురు పెట్టారు. మొత్తానికి మనం చేయాలని అని సంకల్పించుకున్న మార్గంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తలొంచక ముందుకు సాగితే.. ప్రపంచం మనల్ని స్వీకరించడం ఖాయమనే సందేశాన్ని మదర్ థెరీసా నిరూపించారు.