Independence Day 2022: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యావత్ భారతదేశం ఘనంగా జరుపుకునేందుకు సిద్ధం అయింది. దేశ రాజధాని దిల్లీలో 500 చోట్ల జాతీయ జెండాలను ఏర్పాటు చేసినట్లు దీల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ తెలిపారు. దిల్లీ మొత్తం త్రివర్ణ నగరంగా మారిందని వివరించారు. ఈరోజు ఒక్కరోజే మొత్తం 25 లక్షల మంది చిన్నారులకు త్రివర్ణ పతాకాలు పంపిణీ చేశామని వివరించారు.
ఇదిలా ఉండగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ఎర్రకోటలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎర్రకోటలో ఘనంగా నిర్వహించనున్నారు. చారిత్రక ఎర్రకోటలపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 9వ సారి జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. ఈ ఏడాది పంద్రాగస్టు వేడకలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ కూడా కరోనా కోరల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వేళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు...
76వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని హర్ ఘర్ తరంగా వంటి కార్యక్రమాలను నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాల ప్రజలు మువ్వన్నెల జెండా చేతబూని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించింది. మేరా భారత్ మహాన్ అంటూ దేశ భక్తిని చాటారు. ప్రతి ఏటా ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో కీలక అంశాలను హైలెట్ చేస్తుంటారు. దేశాభివృద్ధి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వివిధ వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలను, త్వరలో చేపట్టబోయే పనులను ప్రస్తావిస్తుంటారు. గత సంవత్సరం చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ.. ప్రధానంగా జాతీయ హైడ్రోజన్ మిషన్, గతి శక్తి మాస్టర్ ప్లాన్, 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి అంశాలను ప్రస్తావించారు.
10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు..
ఈసారి 100 ఏళ్ల స్వాతంత్ర్య భారత లక్ష్యాలు, ఆత్మ నిర్భర భారత్, దేశాభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యసాయం, రైల్వేలు, ఇంధనం, క్రీడలు, సంక్షేమ పథకాలు నూతన ఆవిష్కరణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించే అకాశం ఉంది. స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ చారిత్రక ఎర్రకోట చుట్టూ... పటిష్ఠమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రూ.10 వేల మంది పోలీసులు భద్రతా దళాలతో శత్రు దుర్భేద్యంగా మార్చారు. 1000 సీసీ కెమెరాలు మొబైల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వాడ్స్ ను రంగంలోకి దించారు.
డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. నాలుగు కిలో మీటర్ల దూరంలోని డ్రోన్ లను గుర్తించి, నేలకూల్చేలా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతరుల లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ ఉన్న 8 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు సెంట్రల్ దిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి.