Indian Navy Independence Day Celebrations: 


శాన్‌డిగో హార్బర్‌లో INS సత్పుర 


ఇండియన్ నేవల్ షిప్ సత్పుర (INS Satpura) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. కాలిఫోర్నియాలోని శాన్ డిగో హార్బర్‌కు చేరుకుంది. అక్కడే స్వతంత్ర వేడుకలు జరుపుకుంటుందని అమెరికాలోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఇదే విషయాన్ని ట్విటర్‌లో తెలిపింది. షిప్ ఫోటోలు షేర్ చేస్తూ.."భారత యుద్ధ నౌక INS సత్పుర శాన్‌డిగో హార్బర్‌కు చేరుకుంది. ఇక్కడే స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది" అని పేర్కొంది. గతంలో రిమ్ ఆఫ్ పసిఫిక్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొంది INS సత్పుర. నార్త్ అమెరికాలోని భారతీయుల సమక్షంలో బేస్‌పోర్ట్‌కు 10 వేల నాటికన్ మైళ్ల దూరంలో ఆగస్టు 15వ  తేదీన జాతీయ జెండాను ఎగరేయనుంది ఈ షిప్. 75 ల్యాప్ (75 Lap) "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ రన్"ని కూడా నిర్వహించనున్నారు. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన 75 మంది సమరయోధుల త్యాగానికి గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. నార్త్ అమెరికాలోని వెస్ట్ కోస్ట్‌లో ఓ భారతీయ యుద్ధ నౌక ప్రవేశించటం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ నేవీకున్న బలాన్ని చాటి చెప్పిన సందర్భమిది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా...భారతీయ నౌకాదళం దాదాపు ఏడాదిగా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంది.





 


పెర్త్‌లో INS సుమేధ..


ఆపరేషనల్ డిప్లాయ్‌మెంట్‌లో భాగంగా INS సుమేధ (INS Sumedha) కూడా ఆగ్నేయ హిందూమహాసముద్రంలోని పెర్త్‌ హార్బర్‌కు చేరుకుంది. అన్ని ఖండాల్లోనూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది...భారతీయ నౌకా దళం. స్వాంతత్య్రం గొప్పదనం చాటేందుకు ఆగస్టు 15వ తేదీన ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నారు. INSతరపున ఆగస్టు 15న స్వతంత్ర వేడుకల్ని ఈ నౌక నుంచే ప్రారంభించనున్నారు. అంతే కాదు. ఈ నౌకను సందర్శించేందుకు అక్కడి భారతీయులకు అనుమతి ఇవ్వనున్నారు. కాన్సులేట్ జరనల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో INS సుమేధకు చెందిన బ్యాండ్..ఇండియా డే పరేడ్‌ (India Day Parade) చేపట్టనుంది. ఫ్లీట్ ఆపరేషన్లు చేపట్టేందుకు పూర్తి దేశీయంగా తయారు చేసిన నౌక ఇది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లటం ద్వారా ఆస్ట్రేలియా, భారత్ మధ్య స్నేహ సంబంధాలు పెంచుకోవాలనే సంకేతాలిచ్చినట్టైంది. భవిష్యత్‌లో పరస్పర  సహకారానికీ ఇది ప్రతీకగా నిలవనుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోనే కాకుండా అంతర్జాతీయ భద్రత బాధ్యతలనీ తీసుకుంది ఈ INS సుమేధ. ఆస్ట్రేలియా నేవీ, ఇండియన్ నేవీ సంయుక్తంగా పని చేస్తూ..అంతర్జాతీయ జలాల్లో జరిగే వాణిజ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి.