Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం అంటేనే భక్తులు పరితపించి పోతారు. ప్రతినిత్యం వేల సంఖ్యలో స్వామి వారి సన్నిధికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. స్వామి వారిని దగ్గరగా దర్శనం చేసుకోవడానికి ఒక్క వీఐపీ బ్రేక్ దర్శనానికి మాత్రమే ఉంది. అందుకే ఈ బ్రేక్ దర్శనానికి ఇంత డిమాండ్ ఉంటుంది. భక్తుల దర్శనం కోరికను తెలుసుకుని కొందరు దళారీలు వారి ఆలయంపైనే వ్యాపారాన్ని చేస్తున్నారు. దర్శనం పేరుతో భక్తులను మోసం చేసి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు మరికొందరు దళారులు. తాజాగా బ్లాక్ లో శ్రీవారి దర్శనం టికెట్లు విక్రయిస్తున్న ఇంటి దొంగ గుట్టును తిరుమల పోలీసులు రట్టు చేశారు. భక్తులు టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగుచూసింది. విచారణ నిమిత్తం కేసును టీటీడీ విజిలెన్స్ తిరుమల పోలీసులకు అప్పగించింది.
టీటీడీ ఉద్యోగి టికెట్ల దందా..
టీటీడీలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున్ కొంతకాలం నుంచి శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము గడిస్తున్నాడు. అయితే తిరుమల శ్రీవారి దర్శనంకు టిక్కెట్లు దొరకని భక్తులని టార్గెట్ గా చేసుకుని మల్లికార్జున్ తన కార్యాకలాపాలను సాగించేవాడు. ఈ క్రమంలో భక్తులు మల్లికార్జున్ పై టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు టీటీడీలో సూపరింటెండెంట్ గా ఉన్న మల్లికార్జున్ పై టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రెండు రోజుల కిందట ఓ భక్తుడికి శ్రీవారి దర్శన టోకెన్లు అధిక ధరలకు విక్రయించడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు మల్లికార్జున్ పై కేసు నమోదు చేశారు.
మల్లికార్జున్ ప్రస్తుతం విశాఖపట్నంలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టు విశాఖపట్నం ఏరియాకు క్లస్టర్ సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉన్నారు. మల్లికార్జున్‌కు విజయవాడకు చెందిన నోముల వెంకట మురళి కృష్ణ, తడికమల గణేశ్ వెంకట సుబ్బారావు, ఉప్పల వంశీ కృష్ణలు తెలిసిన ప్రజా ప్రతినిధుల యొక్క సిఫార్సు లెటర్స్ లను తీసుకొని మల్లికార్జునకు ఇచ్చేవారు. ఆ సిఫార్సు లేఖలను మల్లికార్జున హైదరబాద్ కి చెందిన కంటసాని విజయకుమారి, ఆమె కుమార్తె నవ్యశ్రీలు కలిసి యాత్రికులను సేకరించి యాత్రికులకు సుపథం, బ్రేక్ దర్శనం, కళ్యాణోత్సవం, వసతులు కల్పించి యాత్రికుల వద్ద నుండి 500 రూపాయల విలువ వి.ఐ.పి బ్రేక్ టికెట్ ఒక వ్యక్తికి నుంచి 3000 రూపాయల చొప్పున 6 మందికిగానూ 18000 రూపాయలు వసూలు చేశారు.
భక్తులకు టికెట్లతో అధిక వసూళ్లు
300 రూపాయల విలువ గల సుపథం టికెట్‌పై ఒక వ్యక్తి నుంచి 2000 రూపాయల చొప్పున 6 మంది వద్ద నుంచి 12,000 రూపాయలు టికెట్ ధర కంటే అధికంగా డబ్బులను తీసుకొని అమాయకులైన యాత్రికులను మోసం చేశారు. ఇప్పటివరకు 721 వివిధ రకాల సేవ టిక్కెట్లు, 25 రూములను అధిక ధరకు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ వారు ఇచ్చిన ఫిర్యాదుపై తిరుమల టూ టౌన్ పోలీసు క్రైమ్ నెంబర్ 127/2022 u/s 420 r/w 34 ఐపిసీ సెక్షన్ కింద నిందితులపై కేసు నమోదు చేశారు. టీటీడీ సూపరింటెండెంట్ మల్లికార్జున్ తో పాటుగా, మరో ఐదు మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. భక్తులు ఎటువంటి దళారులను నమ్మి వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి మోస పోకూడదని పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో టికెట్లు విడుదల చేసిన సమయంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ రూపంలో టికెట్లు కొనుగోలు చేయాలని పోలీసులు, అధికారులు సూచించారు.