ముంబై: మస్కట్ నుంచి వచ్చిన ఓ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొచ్చి నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం 6E 2706లో బాంబు ఉందని బెదిరింపులు రావడంతో నాగ్‌పూర్‌కు విమానాన్ని మళ్లించారు. నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. అనంతరం ప్రయాణికులందరినీ ఎయిర్ లైన్స్ సిబ్బంది కిందకి దించేశారు. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు, దర్యాప్తు జరుగుతోందిని నాగ్‌పూర్ డీసీపీ లోహిత్ మతాని చెప్పారు.
కోల్‌కతాలో ఎయిరిండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్
కోల్‌కతా: ఎయిర్ ఇండియా విమానం AI180లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో సర్వీసును మధ్యలోనే నిలిపివేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా వచ్చిన ఎయిరిండియా విమానం ఇటు నుంచి ముంబై వెళ్లాల్సి ఉంది. మంగళవారం తెల్లవారుజామున ఎయిర్ ఇండియా విమానంలో ఒక ఇంజిన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ గుర్తించారు. ఎయిరిండియా విమానం అర్ధరాత్రి 12.45 గంటల సమయానికి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఎడమ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య రావడంతో టేకాఫ్ చేయడానికి ముందే 5.20 గంటలకు విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని ప్రకటించారు. దాంతో ముంబైకి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ ముందే నిలిపివేసి, ప్రయాణికులను విమానం నుంచి కిందకి దించేశామని అధికారులు తెలిపారు.
కాగా, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన లుఫ్తాన్సా విమానంలో బాంబు ఉందని బెదిరింపులు రావడంతో వెనక్కి మళ్లించారు. విమానం మళ్లీ ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ అయింది. సోమవారం నాడు ఈ ఘటన జరగడం తెలిసిందే.