Iran Israel conflict: ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత పౌరులకు ఇరాన్‌లోని ఎంబసీ కీలక ప్రకటన చేసింది. భారత పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIOs) వెంటనే రాజధాని టెహ్రాన్ నగరాన్ని తక్షణమే విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం వారికి సూచించింది. తమ సొంత ప్రయత్నాలతో బయటకు వెళ్ళగలిగే వారు ఆలస్యం చేయకుండా టెహ్రాన్ నుండి వెళ్లిపోవాలని సూచించింది. టెహ్రాన్ లోని పౌరులకు ఏమైనా సహాయం కావాలంటే +989010144557; +989128109115; +989128109109 నెంబర్లలో తమను సంప్రదించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
అమెరికా నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే ఇజ్రాయెల్ సైలెంట్ అయిపోతుందని ఇరాన్ అంటోంది. తాము అమెరికాకు ఒక్క మాట చెబితే.. వాషింగ్టన్ నుంచి నుంచి ఒక్క ఫోన్ కాల్ వచ్చిందంటే ఇజ్రాయెల్ మౌనంగా ఉండిపోతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇరాన్ కోరింది.
జీ7 నుంచి వెళ్లిపోనున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 సమ్మిట్ మధ్యలోనే వైదొలగిపోనున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ తన మాట వినకపోవడంతో దాడులు పెరిగే అవకాశం ఉందని పౌరులు టెహ్రాన్ నగరం విడిచి వెళ్లాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ట్రంప్ సైతం జీ7 పూర్తయ్యే వరకు ఉండకుండా, మధ్యలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు ప్రపంచ దేశాల వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మెడిసిన్, వస్త్రాలు, ముడి చమురు లాంటి పలు ఉత్పత్తుల ధరలు అమాంతం పెరగనున్నాయి. పలు దేశాల మధ్య వాణిజ్యం ఆగిపోయి ఆర్థిక మాంధ్యం వచ్చే ప్రమాదం లేకపోలేదు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొన్ని రోజుల కిందట మొదలైన ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ కు తాను సూచించిన సమయంలోనే అణు ఒప్పందంపై సంతకం చేసి ఉండాల్సిందన్నారు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని తాను పదే పదే స్పష్టం చేశారు. మరోవైపు G7 శిఖరాగ్ర సమావేశం మధ్యలోనే ట్రంప్ అమెరికాకు తిరుగు ప్రయాణం కానున్నారు. "ప్రతి ఒక్కరూ వెంటనే టెహ్రాన్ నగరాన్ని వెంటనే ఖాళీ చేయాలి" అని ట్రంప్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ట్రంప్ పోస్ట్ పలు దేశాలకు సందేశాన్ని ఇవ్వడంతో పాటు సందేహాలు రెట్టింపు చేసినట్లు అయింది.