Air India Flight Technical Issue | కోల్‌కతా: మరో ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో సర్వీసును నిలిపివేశారు. చివరి నిమిషంలో అధికారులు ప్రకటన చేసి, ప్రయాణికులను విమానం నుంచి కిందకి దించారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఇంజిన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ గుర్తించారు. దాంతో ప్రయాణీకులను విమానం నుంచి దిగాలని సూచించింది ఎయిర్ లైన్స్. 

ఎయిరిండియా విమానం AI180 అర్ధరాత్రి 12.45 గంటల సమయానికి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. కానీ ఎడమ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైకి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యం అయింది. ఈ క్రమంలో దాదాపు ఉదయం 5.20 గంటలకు విమానంలో సమస్య తలెత్తినట్లు ప్రయాణికులకు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారిని విమానం నుంచి దించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఫ్లైట్ కెప్టెన్ తెలిపారు.

జూన్ 12 నుంచి వరుస ఘటనలు

జూన్ 12న మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని వారిలో ఒక్కరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద కూలడంతో అక్కడ సైతం 24 మంది వరకు చనిపోయారు. అది మొదలుకుని ప్రతిరోజూ ఏదో చోట ఎయిర్ ఇండియా విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించి సర్వీసులు నిలిపివేస్తున్నారు. తాజాగా మంగళవారం ఉదయం ముంబైకి టేకాఫ్ సమయానికి ముందు కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానాన్ని చివరి నిమిషంలో నిలిపివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లోనూ గాల్లో ఉండగా సమస్యలు ఉన్నట్లు గుర్తించి వెనక్కి మళ్లించిన ఘటనలు జరుగుతున్నాయి. హాంకాంగ్ నుండి ఢిల్లీకి వస్తుండగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో సోమవారం నాడు టెక్నికల్ ప్రాబ్లమ్ గుర్తించారు. దాంతో ఎయిర్ ఇండియా విమానాన్ని మళ్లీ హాంకాంగ్‌కు తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

Also Read: Air India: హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్, ఎయిర్ ఇండియా సర్వీస్ వెనక్కి మళ్లింపు 

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారిని డీఎన్ఏ టెస్టులు నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికకాయాన్ని గుర్తించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక కుటుంబానికి ఆయన భౌతికకాయాన్ని అప్పగించగా స్వస్థలానికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.