Bullet train in India: దేశంలో రైలు ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లెట్ రైళ్లు(Bullet Train) మరో రెండేళ్లలో పట్టాలపై రయ్యన దూసుకుపోనున్నాయి. దీనికి సంబంధించి కొన్నేళ్ల నుంచి కేంద్ర రైల్వేశాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్రల మధ్య రెండు హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లపై బుల్లెట్ రైళ్లు దూసుకుపోనున్నాయి. అయితే.. దీనికి సంబంధించి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చేసింది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw).. తెలిపిన వివరాల మేరకు 2026, సెప్టెంబరు-డిసెంబరు మధ్య నాటికి ఈ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఈ రైళ్లలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘రైజింగ్ భారత్ సమ్మిట్’(Raising Bharth Summit)లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు.
ఇతర దేశాల కంటే మనం ఫాస్ట్
బుల్లెట్ రైళ్ల నిర్మాణం, రైలు ప్రాజెక్టు కారిడార్‌ల విషయంలో ప్రపంచ దేశాల కంటే చాలా వేగంగా భారత్ అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ‘‘బుల్లెట్ రైలు కోసం 500 కిలో మీటర్ల ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. దీనికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, మనం మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra modi) నేతృత్వంలో చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 8-10 సంవత్సరాల్లోనే బుల్లెట్ రైలు కారిడార్ ను పూర్తిచేయనున్నాం. అది కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నాం. ఏ విషయంలోనూ రాజీ పడకుండా.. అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాం. 2026 సెప్టెంబరు-డిసెంబరు నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది.
మొదట గుజరాత్(Gujarath)లోని సూరత్ నుంచి బిలిమోరా(Bilimora) వరకు దీనిని నడపనున్నాం. అదేవిధంగా 2028 నాటికి ముంబయి(Mumbai)- అహ్మదాబాద్(Ahmadabad) పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్-ముంబయి మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. దీనికి డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేసినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
మేడిన్ ఇండియా చిప్ కూడా!
ఈ ఏడాది చివరి నాటికి భారత దేశంలోనే తయారైన ‘మేడిన్ ఇండియా’(Made in India) చిప్ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ‘‘వికసిత్ భారత్(Vikasit Bharath)కు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం చాలా కీలకమైంది. రానున్న ఐదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో టాప్-5 దేశాల్లో భారత్(India) నిలుస్తుందని మేం విశ్వాసంగా ఉన్నాం. అమెరికా చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ(Micron Technology)తో ఒప్పందం జరిగింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి మన దేశంలోని ఈ ప్లాంట్ నుంచి తొలి మేడిన్ ఇండియా చిప్ రానుంది. గుజరాత్‌లోని ధోలేరాలో టాటా(TATA) ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ 2026 డిసెంబరు నాటికి చిప్‌లను ఉత్పత్తి చేయనుంది’’ అని వైష్ణవ్ వెల్లడించారు. దీంతో దేశీయంగా మరింత చౌకగా చిప్‌లు లభించడంతోపాటు వీటి కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండే పరిస్థితి వస్తుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదిక చిప్ ల తయారీకి అనుమతులు ఇస్తున్నామన్నారు.