World Famous Indian Scientists: పురాతన కాలం నుంచి సమకాలీన కాలం వరకు ప్రపంచ సైన్స్ (World Science) అభివృద్ధిలో భారత్ (India) పాత్ర ఎప్పుడూ కీలకమే. ఈ వైజ్ఞానిక ఆవిష్కరణలలో చాలా వరకు భారతీయ శాస్త్రవేత్తలు (Indian Scientists) తమ వంతు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం, సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాద్ సాహా, ప్రఫుల్ల చంద్ర రే, సలీం అలీ, హోమీ జహంగీర్ బాబా, జగదీష్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజన్, సీవీ రామన్, ప్రశాంత చంద్ర మహలనోబిస్, సుబ్రమణ్య చంద్రశేఖర్, బీర్బల్ సాహ్ని, రాజ్ రెడ్డి, ఎస్ఎస్ అభ్యంకర్, హర్ గోవింద్ ఖురానా వంటి వారు సైన్స్ రంగాల్లో ప్రయోగాలు చేసి భారత దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు.


అబ్దుల్ కలాం భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ అభివృద్ధికి కృషి చేశారు. సత్యేంద్ర నాథ్ బోస్ బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి పని చేశారు. మేఘనాథ్ సాహా నక్షత్రాలలో రసాయన, భౌతిక పరిస్థితులను వివరించడానికి ఉపయోగించే ‘సాహా అయనీకరణ’ సమీకరణాన్ని అభివృద్ధి చేశారు. ఫుల్ల చంద్ర రే మెర్క్యురస్ నైట్రేట్ అనే కొత్త సమ్మేళనాన్ని కనుగొన్నారు. సలీం అలీ సిస్టమాటిక్ బర్డ్ సర్వేను కనుగొన్నారు. హోమి జె బాబా భారతదేశ అణు ప్రయోగాల పితామహుడిగా గుర్తింపు పొందారు.  


జగదీష్ చంద్రబోస్ మొక్కల పెరుగుదలను కొలవడానికి క్రెస్కోగ్రాఫ్‌ను కనుగొన్నారు. రామానుజన్ విశ్లేషణ, పై, సంఖ్య సిద్ధాంతంపై అన్వేషణలు చేశారు. సీవీ రామన్ భౌతిక శాస్త్రంలో రామన్ ప్రభావాన్ని కనుగొన్నారు. ప్రశాంత చంద్ర మహలనోబిస్ మహలనోబిస్ దూరాన్ని కనుగొన్నారు. అలాగే రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణ కోసం వ్యూహాన్ని రూపొందించారు. సుబ్రమణ్య చంద్రశేఖర్ మరగుజ్జు నక్షత్రాల గరిష్ట ద్రవ్యరాశి లెక్కించే విధానం కనుగొన్నారు. బీర్బల్ సాహ్ని పురాతన శిలాజాలను అధ్యయనం చేసి, హోమోక్సిలాన్ రాజ్‌మహాలెన్స్ శిలారూపాలను కనుగొన్నారు. రాజ్ రెడ్డి ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈయన పాత్ర ఎంతో కీలకం. ఎస్ఎస్ అభ్యంకర్ బీజగణితంపై ప్రయోగాలు చేశారు. హర్ గోవింద్ ఖురానా న్యూక్లియిక్ ఆమ్లాలలోని న్యూక్లియోటైడ్లు ప్రోటీన్ సంశ్లేషణను ఎలా నియంత్రిస్తాయో కనుగొన్నారు. వారి జీవిత చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకోండి.
 
అబ్దుల్ కలాం
తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15వ తేదీన జన్మించిన అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం భారతదేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరు. 2002 నుంచి 2007 మధ్య భారత రాష్ట్రపతిగా పనిచేశాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 1969లో ఇస్రోలో చేరి ఎస్‌ఎల్వీ- III ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తరువాత క్షిపణి రంగం, అణ్వాయుధ తయారీలో కీలకంగా వ్యవహరించి ‘భారత మిస్సైల్ మ్యాన్’గా గుర్తింపు పొందారు. జూలై 27, 2015న మరణించారు.


సత్యేంద్రనాథ్ బోస్ 
సత్యేంద్రనాథ్ బోస్ ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భౌతిక రంగం శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు. అతను జనవరి 1, 1894న పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో జన్మించాడు. 1954లో భారత ప్రభుత్వంచే పద్మ విభూషణ్ అందుకున్నారు. బోస్-ఐన్‌స్టీన్ గణాంకాల అభివృద్ధికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేశారు. క్వాంటం మెకానిక్స్‌పై ఆయన చేసిన కృషికి ప్రసిద్ధి చెందాయి. ఫిబ్రవరి 4, 1974న మరణించారు. 


మేఘనాథ్ సాహా 
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలలో మేఘనాథ్ సాహా ఒకరు. 1893 అక్టోబరు 6వ తేదీన ఢాకా (ప్రస్తుత బంగ్లాదేశ్) సమీపంలోని షారటోలీ అనే గ్రామంలో జన్మించారు. ఆయన ‘సాహా’ అయనీకరణ సమీకరణాన్ని అభివృద్ధి చేశాడు. ఇది నక్షత్రాలలో భౌతిక, రసాయన పరిస్థితులను వివరించడానికి ప్రాథమిక సాధనాల్లో ఒకటి. అలాగే సౌర కిరణాల ఒత్తిడి, బరువును కొలిచే పరికరాన్ని కూడా కనుగొన్నాడు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అసలు ప్రణాళికను ఈయనే తయారుచేశాడు. 1943లో కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆయన పేరు మీద స్థాపించబడింది. ఫిబ్రవరి 16, 1956న న్యూఢిల్లీలో మరణించారు.



ప్రఫుల్ల చంద్ర రే
భారతదేశంలో రసాయన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడుతున్న ప్రఫుల్ల చంద్ర రే 1861 ఆగస్టు 2వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత బంగ్లాదేశ్‌లో)లోని జెస్సోర్ జిల్లాలోని రరులి-కటిపరా గ్రామంలో జన్మించారు. అతను 1901లో కోల్‌కతాలో స్థాపించబడిన బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ అనే భారతదేశపు మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీ స్థాపకుడు. జూన్ 16, 1944న మరణించారు.
 
సలీం అలీ
బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ 1896 నవంబర్ 12న మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించారు. ప్రకృతి శాస్త్రవేత్త, పక్షి శాస్త్రవేత్త, సలీం అలీ భారతదేశం అంతటా పక్షులపై క్రమబద్ధమైన సర్వేలు నిర్వహించిన మొదటి భారతీయుడు ఈయన. భరత్‌పూర్ పక్షుల అభయారణ్యం స్థాపనలో అతను ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన సేవలకు 1958, 1976లో పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో ప్రభుత్వం సత్కరించింది. అమెరికన్ పక్షి శాస్త్రవేత్త సిడ్నీ డిల్లాన్ రిప్లీతో కలిసి పది-వాల్యూమ్‌ల హ్యాండ్‌బుక్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్థాన్‌ను రాశారు. 1987 జూన్ 20న మరణించారు.
 
హోమీ జహంగీర్ బాబా
భారత అణు కార్యక్రమ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన హోమీ జహంగీర్ బాబా అక్టోబర్ 30, 1909న జన్మించారు. ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను, ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. 1945లో బొంబాయిలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌, 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్‌ను స్థాపించాడు. జనవరి 24, 1966న ఆస్ట్రియాకు వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు.


జగదీష్ చంద్రబోస్
బెంగాలీ సైన్స్ ఫిక్షన్ పితామహుడిగా పరిగణించబడుతున్న జగదీష్ చంద్రబోస్ 30 నవంబర్ 1858న బెంగాల్ ప్రెసిడెన్సీలోని మైమెన్‌సింగ్‌లో (ప్రస్తుత బంగ్లాదేశ్‌లో) జన్మించారు. క్రెస్కోగ్రాఫ్ యొక్క ఆవిష్కరణ వంటి మొక్కల శాస్త్రానికి ఆయన చేసిన కృషి ముఖ్యమైనది. మొక్కల పెరుగుదలను కొలవగలదు. రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ పరిశోధనలో కూడా అతను మార్గదర్శక పాత్ర పోషించాడు. అతను తన ఆవిష్కరణలలో దేనికైనా పేటెంట్ హక్కును వ్యతిరేకించిన అతికొద్ది మంది శాస్త్రవేత్తలలో ఒకడు. జెసి బోస్ 1937 నవంబర్ 23న మరణించారు.


శ్రీనివాస రామానుజన్
తమిళనాడులో 1887 డిసెంబరు 22వ తేదీన రామానుజన్ జన్మించారు. గణిత శాస్త్రజ్ఞుడిగా, విశ్లేషణ, అనంత శ్రేణి, సంఖ్య సిద్ధాంతం అభివృద్ధికి కృషి చేశారు. రామానుజన్ తీటా ఫంక్షన్, రామానుజన్ ప్రైమ్, మాక్ తీటా ఫంక్షన్‌లు, విభజన సూత్రాలు అభివృద్ధి చేశారు. కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు, రాయల్ సొసైటీకి చెందిన అతి పిన్న వయస్కులలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఏప్రిల్ 26, 1920న రామానుజన్ మరణించారు.


సీవీ రామన్ 
చంద్రశేఖర వెంకట రామన్ ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఈయన 1888 నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించాడు. కాంతిని వెదజల్లే రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. ఆయన చేసిన కృషికి 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. 1954లో భారత ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. 1970 నవంబర్ 21న రామన్ మరణించారు.



ప్రశాంత చంద్ర మహలనోబిస్
ప్రశాంత చంద్ర మహలనోబిస్ 1893 జూన్ 29న పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా (కోల్‌కతా)లో జన్మించారు. అతను మహలనోబిస్ దూరం అని పిలువబడే గణాంక కొలతను వృద్ధి చేశారు. మొదటి ప్రణాళికా సంఘం సభ్యులలో ఒకరు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపకుడు. భారతదేశంలో పెద్ద ఎత్తున నమూనా సర్వే రూపకల్పన, ఆంత్రోపోమెట్రీ అధ్యయనానికి అతను భారీ సహకారాన్ని అందించాడు. 28 జూన్ 1972న మరణించారు.


సుబ్రమణ్య చంద్రశేఖర్
సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాల నిర్మాణం, పరిణామానికి అవసరమైన భౌతిక ప్రక్రియలపై అధ్యయనం చేసి 1983లో కృషికి నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఈ రోజు న్యూట్రాన్ స్టార్స్, లేదా బ్లాక్ హోల్స్ పిలవబడే వాటిపై ఆయన ప్రయోగాలు చేశారు. 


బీర్బల్ సాహ్ని
బీర్బల్ సాహ్ని ప్రఖ్యాత పాలియోబోటానిస్ట్, భారతీయ శాస్త్రవేత్త. భారత ఉపఖండంలోని శిలాజాలపై పరిశోధనలు చేశారు. అంతేకాకుండా పురాతన శిలాజాలను కనుగొని గుర్తింపు పొందారు. దేశంలో సహజసిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాజాలపై పరిశోధనలు చేశారు. 


రాజ్ రెడ్డి
భారత దేశానికి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త రాజ్ రెడ్డి. ఈ రోజు ఏఐగా మనకు తెలిసిన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకంగా పనిచేశారు. పెద్ద ఎత్తున ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధికి క‌ృషి చేశారు. ఈ రోజుల్లో అధికంగా ఉపయోగించబడుతున్న గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి, ఏఐ వ్యవస్థ వృద్ధికి ఆయన చేసిన కృషి గణనీయంగా దోహదపడింది. 


ఎస్ఎస్ అభ్యంకర్
ఎస్ ఎస్ అభ్యంకర్ బీజగణితంలో ప్రసిద్ధి చెందారు. మరణించే సమయంలో.. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర విశిష్ట ప్రొఫెసర్‌గా పనిచేశాడు. గణితంతో పాటు, అతను కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. 


హర్ గోవింద్ ఖురానా
హర్ గోవింద్ ఖురానా 1968లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. బయోకెమిస్ట్రీ, అనుబంధ రంగాలపై విపరీతమైన ప్రయోగాలు చేశారు. న్యూక్లియిక్ యాసిడ్స్‌లోని న్యూక్లియోటైడ్‌లు ప్రొటీన్ సంశ్లేషణను ఎలా నియంత్రిస్తాయో వివరించారు.  
 
నాసాలో భారతీయ శాస్త్రవేత్తలు
భారతదేశంలోని ప్రసిద్ధ శాస్త్రవేత్తలు నాసా, ఇస్రో, భారత ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేశారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం..



  • కమలేష్ లుల్లా: భారతదేశంలోని ప్రసిద్ధ శాస్త్రవేత్తలలో ఒకరిగా కమలేష్ లుల్లా గుర్తింపు పొందారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియోసైన్స్ రిమోట్ సెన్సింగ్‌లో స్పెషలైజేషన్‌తో పీహెచ్‌డీలు చేశారు. అమెరికన్ అంతరిక్ష సంస్థలో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన శాస్త్రవేత్తలలో ఒకరు. 

  • మెయ్య మెయ్యప్పన్: మెయ్య మెయ్యప్పన్ నాసా సెంటర్ ఫర్ నానోటెక్నాలజీలో ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీకి చీఫ్ సైంటిస్ట్. అతను IWGN వ్యవస్థాపక సభ్యుడు కూడా.  

  • సునీత ఎల్. విలియమ్స్: సునీతా ఎల్. విలియమ్స్ భారతదేశంలోని ప్రసిద్ధ శాస్త్రవేత్తలలో ఒకరు. ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్‌ను 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. నాసాలో స్థానం పొందిన రెండో భారతీయ-అమెరికన్ మహిళగా గుర్తింపు పొందారు. అలాగే 29 గంటల 17 నిమిషాలకు నాలుగు స్పేస్‌వాక్‌ చేసి ప్రపంచ రికార్డు సాధించారు.

  • అనితా సేన్‌గుప్తా: అనితా సేన్‌గుప్తా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రవేత్తలలో ఒకరు. ఏరోస్పేస్ ఇంజనీర్‌గా 2011లో అంగారక గ్రహానికి క్యూరియాసిటీ రోవర్‌ ప్రయోగంలో కీలకంగా పని చేశారు. మార్స్, ఆస్టరాయిడ్స్, డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌ను సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో పనిచేశారు.

  • అశ్విన్ వాసవాడ: ప్లానెటరీ సైన్స్‌లో డాక్టరేట్ పొందిన అశ్విన్ వాసవాడ నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ మిషన్‌లో కూడా పనిచేశారు.



భారతీయ మహిళా శాస్త్రవేత్తలు
భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలో మహిళలు సైతం కీలక పాత్ర పోషించారు. ఔషధం రంగం నుంచి ఖగోళ, భౌతిక శాస్త్రం, అణు పరిశోధన వరకు భారతీయ మహిళలు తమ సత్తా చాటారు. అలాంటి వారిలో కొందరి గురించి మీకోసం..



  • జానకి అమ్మాళ్, వృక్షశాస్త్రవేత్త

  • అసిమా ఛటర్జీ, రసాయన శాస్త్రవేత్త

  • కల్పనా చావ్లా, వ్యోమగామి

  • రాజేశ్వరి ఛటర్జీ, శాస్త్రవేత్త

  • అన్నా మణి, భౌతిక శాస్త్రవేత్త

  • రోహిణి గాడ్‌బోలే, భౌతిక శాస్త్రవేత్త

  • రీతు కరిధాల్, శాస్త్రవేత్త

  • చారుసితా చక్రవర్తి, శాస్త్రవేత్త

  • దర్శన్ రంగనాథన్, రసాయన శాస్త్రవేత్త

  • టెస్సీ థామస్, శాస్త్రవేత్త

  • అదితి పంత్, ఓషనోగ్రాఫర్

  • కమలా సోహోనీ, బయోకెమిస్ట్

  • బీభా చౌదరి, భౌతిక శాస్త్రవేత్త

  • శుభా టోలే, న్యూరో సైంటిస్ట్

  • యమునా కృష్ణన్, పరిశోధకురాలు


నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్తలు
ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ అత్యున్నత పురస్కారంగా గుర్తింపు పొందింది. 1901లో మొదటిసారిగా పురస్కారాలను అందజేశారు. వివిధ రంగాల్లో ప్రయోగాలు చేసిన భారతీయ ప్రముఖులు ఈ అవార్డులు అందుకున్నారు.



  • సీవీ రామన్

  • హర్ గోవింద్ ఖోరానా

  • సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్

  • వెంకట్రామన్ రామకృష్ణన్