PM Narendramodi Comments: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ(PM Narendramodi) నోటి నుంచి ఏ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చినా దానికి అర్థం, ప‌ర‌మార్థం వేరేగా ఉంటాయి. ఊర‌క‌రారు మ‌హానుభావులు.. అన్న‌ట్టుగా ప్ర‌ధాన మంత్రి కూడా ఏదీ ఊరికేనే ప్ర‌స్తావించ‌రు. తాజాగా ఆయ‌న మ‌హాభార‌తంలోని కీల‌క‌మైన శ్రీకృష్ణ‌(Lord Srikrishna)-కుచేలుడి(Kuchela) వృత్తాంతాన్ని తెర‌ మీదికి తెచ్చారు. ``ఈ రోజు కుచేలుడి వ్యాఖ్య‌ల‌ను తీసుకుంటే శ్రీకృష్ణుడిని కూడా అవినీతిప‌రుడు అంటారేమో. ఆయ‌న కూడా భ్ర‌ష్టుడై ఉండేవాడు`` అని ప్ర‌ధాని అన్నారు. అయితే.. ఇంత‌గా ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్ప‌డానికికార‌ణం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. దీనిపై రాజ‌కీయ విశ్లేష‌కులు.. ఇటీవ‌ల సుప్రీం కోర్టు(Supreme court) ఇచ్చిన కీల‌క తీర్పే కార‌ణ‌మ‌ని అంటున్నారు. నాలుగు రోజుల కింద‌ట ఎల‌క్టోర‌ల్ బాండ్ల(Electoral bonds) వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. వీటిని రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని తేల్చింది. ఇది కేంద్ర ప్ర‌భుత్వానికి ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కుచేలుడి వ్యాఖ్య‌లు.. శ్రీకృష్ణుడి వ్య‌వ‌హారాన్నితాజాగా ప్ర‌స్తావించార‌ని తెలుస్తోంది. 


ఇదీ.. కార్య‌క్ర‌మం!


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభల్ జిల్లాలో శ్రీ కల్కి ధామ్‌ ఆలయానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ.. గత నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కొత్త జీవన చక్రం మొదలైందని తాను చెప్పానని గుర్తుచేశారు. ``అయోధ్యారాముడు వేల సంవత్సరాలు ప్రభావితం చేశాడు. అదే విధంగా అయోధ్యలో బాలక్‌రామ్‌ ప్రతిష్ఠాపనతో వచ్చే వెయేళ్లకు భారత కొత్త ప్రయాణం ప్రారంభమైంది. భారత్‌ అనే జాతిస్వరూప ఆలయాన్ని నిర్మించే బాధ్యతను భగవంతుడు నాకు అప్పగించాడు. ఈ కర్తవ్య నిర్వహణలో సాధు సంతులు నాకు ఆశీస్సులు అందించాలి. ఓవైపు తీర్థయాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తున్నాం. మరోవైపు నగరాల్లో హైటెక్‌ మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఆలయాలతోపాటు దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలు కూడా నిర్మిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మన ప్రాచీన శిల్పసంపదను తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్నాం. ఇదే సమయంలో రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. కాలచక్రం మారుతోందనడానికి.. నవశకం మన తలుపులు తడుతోందనడానికి ఈ మార్పే నిదర్శనం`` అని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలోనే ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ఈ రోజు కుచేలుడి వ్యాఖ్య‌ల‌ను తీసుకుంటే శ్రీకృష్ణుడిని కూడా అవినీతి ప‌రుడు అంటారేమో. ఆయ‌న కూడా భ్ర‌ష్టుడై ఉండేవాడు`` అని అన్నారు. కానీ, ఎంత మంది ప్ర‌య‌త్నించినా.. శ్రీకృష్ణుడి విరాట్ స్వ‌రూపం ముందు తేలిపోతార‌ని వ్యాఖ్యానిం చారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల బాండ్ల‌ను ఉద్దేశించి చేసిన‌వేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.  


సుప్రీంకోర్టు తీర్పు ఇదీ.. 


రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌యాంలో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ పథకం సమాచార హక్కును హరిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాల ని ఆదేశించింది. ఈ ఎన్నికల బాండ్లపై విచారణ జరిపిన రాజ్యంగ ధర్మాసనం.. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టాలనే కారణంతో సమాచార చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. 


ఎప్పుడు తెచ్చారు?


రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ఉద్దేశంతోపాటు న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టే ల‌క్ష్యంతో కేంద్రంలోని న‌రంద్ర‌మోడీ ప్రభుత్వం 2018 జనవరి 2న ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ బాండ్ల కింద పార్టీల‌కు నిధులు ఇచ్చే వారి వివ‌రాల‌ను అత్యంత గోప్యంగా ఉంచుతారు. అయితే.. ఇలా ఈ బాండ్ల ద్వారా.. 2019 నుంచి 2023 వ‌రకు బీజేపీ 3 వేల కోట్ల పైచిలుకు నిధులు అందాయి. ఇదే వివాదానికి దారితీసింది. ఈ పథకాన్ని సవాల్​ చేస్తూ ఏడీఆర్‌, కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకుర్‌, సీపీఎం, మరో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  విచార‌ణ చేప‌ట్టిన‌ సుప్రీం కోర్టు బాండ్లను రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పేర్కొంది. దీనినే ప్ర‌ధాని మోడీ ప‌రోక్షంగా ప్ర‌స్తావించార‌నేదిరాజ‌కీయ ప‌రిశీల‌కుల భావ‌న‌.