Samyukt Kisan Morcha: న్యూఢిల్లీ: నిరసనకు దిగిన రైతులు, కేంద్ర మంత్రుల మధ్య ఇదివరకే మూడు విడతల చర్చలు జరిగాయి. తాజాగా ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఐదేళ్ల వరకు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధర (MSP)కు  ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేస్తాయని మంత్రుల బృందం ఆందోళన చేపట్టిన రైతులకు ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను సంయుక్త కిసాన్ మోర్చా (SKM) తిరస్కరించింది. అయితే ఈ రైతు సంఘం ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చి (Farmer Protest) ఆందోళనలో భాగమైన సభ్యులు కాదని తెలిసిందే.


పంటలకు ఐదేళ్ల కనీస మద్ధతు ధర
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ రైతు సంఘాల  నేతలతో చర్చల్లో పాల్గొన్నారు. వీరితో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సైతం ఈ చర్చల్లో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కందులు, మొక్కజొన్న, మినుములు పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. కేంద్రం చెప్పినట్లుగా అయిదేళ్ల పాటు కనీస మద్ధతు ధరలకు ప్రభుత్వం ఏజెన్సీలు కొనుగోలు చేసే ఆయా పంట ఉత్పత్తులపై ఎలాంటి పరిమితి ఉండదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లోనూ చర్చలు జరిగినా కేంద్రం ఏ నిర్ణయానికి రాలేదు. తాజాగా జరిగిన చర్చలతో రైతులకు 5 ఏళ్ల MSP ఆఫర్ (5-year MSP contract offer) ఇచ్చింది. దీనిపై రైతు సంఘాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సంయుక్త కిసాన్ మోర్ఛా అనే రైతు సంఘం మాత్రం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అన్ని పంటలకు కనీస మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసింది.


సంయుక్త కిసాన్ మోర్ఛా సోమవారం సాయంత్రం మాట్లాడుతూ.. కేంద్రం పేర్కొన్న ఐదు పంటలతో పాటు మొత్తం 23 పంటలకు కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2014 మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా బీజేపీ నేతలు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. 


రైతుల డిమాండ్లు ఇవే.. 
కేంద్రంతో చర్చలు జరుపుతున్నందున ప్రస్తుతానికి రైతుల ఆందోళన (ఢిల్లీ చలోను) తాత్కాలికంగా విరమించారు. తమ డిమాండ్లకు సర్కార్ పరిష్కారం చూపకపోతే ఫిబ్రవరి 21న తిరిగి నిరసన, ఆందోళన కార్యక్రమాలు మొదలుపెడతామని రైతు సంఘాలు హెచ్చరించాయి. రైతుల డిమాండ్లలో కనీస మద్ధతు ధరతో పాటు ఎంఎస్ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు చేయడం. పంట రుణాల మాఫీ, విద్యుత్‌ ఛార్జీలపై టారిఫ్‌ల పెంపు నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు. వీటితో పాటు రైతులు, వ్యవసాయ కూలీలకు పింఛన్లు అందించాలని, 2021 నిరసన సమయంలో రైతులపై నమోదైన కేసుల ఎత్తివేయాలన్న వారి డిమాండ్లు. గతంలో జరిపిన ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ఇవ్వడం, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ చేయాలని సైతం రైతులు కోరుతున్నారు.