Global Top-100 Luxury Goods Makers: ప్రపంచంలో విలాస వస్తువులు ఉత్పత్తి చేస్తున్న టాప్‌-100 కంపెనీల్లో ఆరు భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. మలబార్ గోల్డ్ & డైమండ్స్, టైటాన్‌తో పాటు మరో నాలుగు భారతీయ ఆభరణాల కంపెనీలు 'డెలాయిట్ గ్లోబల్ లగ్జరీ గూడ్స్ లిస్ట్'లోకి (Deloitte's Global Powers of Luxury Goods 2023) చేరాయి. 


టాప్‌-25లో మలబార్‌ గోల్డ్‌, టైటన్‌        
టాప్‌-100 లగ్జరీ బ్రాండ్స్‌లో.. మలబార్ గోల్డ్ & డైమండ్స్ (Malabar Gold & Diamonds), టాటా గ్రూప్‌నకు చెందిన టైటన్‌ (Titan Company) టాప్‌-25 లోనే ఉండడం విశేషం. వరల్డ్‌ వైడ్‌గా.. మలబార్‌ గోల్డ్‌ 19వ స్థానంలో ఉంది, దేశీయంగా టాప్‌ ప్లేస్‌లో ఉంది. దీని తర్వాత, టైటన్‌ గ్లోబల్‌గా 24వ నంబర్‌ పొందింది, దేశీయంగా సెకండ్‌ ప్లేస్‌లో ఉంది.


టాప్‌-50లో కళ్యాణ్ జ్యువెలర్స్, జాయ్ అలుక్కాస్       
డెలాయిట్ గ్లోబల్ లగ్జరీ గూడ్స్ లిస్ట్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ ‍‌(Kalyan Jewellers), జాయ్ అలుక్కాస్‌ (Joyalukkas India) కూడా ఉన్నాయి. ఇవి వరుసగా 46 & 47వ స్థానాల్లో నిలిచాయి. అంటే, గ్లోబల్‌ టాప్‌-50లో ఉన్నట్లు లెక్క. ఈ లిస్ట్‌లో చేరిన మిగిలిన రెండు భారతీయ ఆభరణాల తయారీ కంపెనీలు సెంకో గోల్డ్ & డైమండ్స్ (Senco Gold & Diamonds), తంగమయిల్ జ్యువెలరీ ‍‌(Thangamayil Jewellery). ఇవి వరుసగా 78 & 98 నంబర్లలో ఉన్నాయి.


గ్లోబల్‌ నంబర్ వన్‌ కంపెనీ ఏది?    
వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఫ్రెంచ్ లగ్జరీ కంపెనీ LVMH (లూయిస్‌ విట్టన్‌) గ్లోబల్‌ టాప్‌-100 జాబితాలో అగ్రస్థానంలో ఉంది. VPH కార్ప్‌, రిచెమాంట్‌ కంపెనీలు రెండు & మూడు స్థానాల్లో నిలిచాయి.


ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీలు, 2023 సంవత్సరంలో, 347 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ సాధించాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే (వార్షిక ప్రాతిపదికన) టర్నోవర్‌ 13.4 శాతం పెరిగింది. నంబర్‌-1 కంపెనీ LVMH ఒక్కటే ఇందులో 31 శాతం వాటాతో ఉంది. మొత్తం లగ్జరీ బ్రాండ్స్‌లో దీని స్థానం చెక్కుచెదరనడానికి ఈ నంబరే నిదర్శనం.


వరల్డ్‌ టాప్‌-10 బ్రాండ్స్‌కు గ్లోబల్‌గా 63% మార్కెట్‌ వాటా ఉంది. అంటే, ప్రపంచ లగ్జరీ మార్కెట్‌ను కేవలం 10 కంపెనీలే శాసిస్తున్నాయి. ఈ 10 కంపెనీల అమ్మకాలు 2022 కంటే 2023లో 23% పెరిగాయి. టాప్‌-100 కంపెనీల మొత్తం లాభంలో ముప్పావు శాతం పైగా (76.4%) వాటా ఈ 10 సంస్థలదే కావడం విశేషం.


భారత్‌లో లగ్జరీ వస్తువులకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, మరిన్ని దేశీయ బ్రాండ్స్‌ అంతర్జాతీయ స్థాయిలో నిలిచేందుకు పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున, వినియోగదార్ల ప్రాధాన్యతలు పెరుగుతున్నాయని, దేశంలోని లగ్జరీ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని పేర్కొంది. ఫలితంగా దేశీయ బ్రాండ్‌లకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని డెలాయిట్ వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: వెనక్కు తగ్గిన వెండి, పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే