Andhra Pradesh Elections : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. అభ్యర్థుల ఎంపికలో చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. రాజకీయంగా అంగ, అర్ధబలం ఉన్న ఎంతో మంది నేతలను కాదని.. యువకులకు, సాధారణ వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయిస్తున్న తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాదు.. ప్రతిపక్షాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడు విడతల్లో ప్రకటించిన జాబితాల్లో సుమారు 30 మందికిపైగా యువ నేతలకు ఇన్‌చార్జ్‌లుగా జగన్‌ అవకాశాలు కల్పించారు. రాజకీయ అనుభవం, ఆర్థిక బలం వంటి అంశాలతో సంబంధం లేకుండా సర్వేలు ఆధారంగా, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. అంచానాలకు అంతుచిక్కకుండా సీఎం జగన్‌ సీట్లను కేటాయిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగస్తోంది. 


వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న జగన్‌


రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో జగన్‌ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడు జాబితాల్లో 69 అసెంబ్లీ స్థానాలకు, 18 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 30 మంది అభ్యర్థులు కొత్తవారే ఉండడం గమనార్హం. కొత్త అభ్యర్థులను ప్రకటించిన అనేక స్థానాల్లో రాజకీయంగా ఉద్ధండులైన సీనియర్‌ నేతలను కాదని కొత్త వారిని బరిలోకి దించుతుండడం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జగన్‌ తీసుకున్న నిర్ణయాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆర్థిక, అంగబలం ఉన్న పెద్దారెడ్డుగా చెప్పే వారిని కాదని.. కొత్త వారికి అక్కడ అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ సమీకరణాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని భావించిన సీనియర్‌ నేత వేమిరెడ్డి సూచనలను పట్టించుకోకపోవడంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. ఈ స్థానానికి అరబిందో సంస్థలు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న శరత్‌ చంద్రారెడ్డిని బరిలో దించేందుకు సిద్ధపడుతున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ రాజకీయంగా అనుభవం ఈయనకు లేదు. అలాగే, ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి, నరసారావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ అధిష్టానం టికెట్లు నిరాకరించింది. శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు స్థానానికి బదిలీ చేయాలని భావించడంతో అందుకు నిరాకరించిన ఆయన టీడీపీలో చేరిపోయారు.


అంతుచిక్కని జగన్‌ వ్యూహాలు


రానున్న సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో జగన్‌ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రతిపక్షాలకే కాదు.. సొంత పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్‌.. సర్వే ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఎటువంటి మొహమాటలకు తావివ్వకుండా ముందుకు వెళుతున్నారు. బంధువులు, అనుభవం వంటి అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. జగన్‌ విజయమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా జగన్‌ అనుసరిస్తున్న విధానాలు, అభ్యర్థుల మార్పులు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సత్ఫలితాలను ఇస్తే మాత్రం భవిష్యత్‌లో దేశంలోని అనేక పార్టీలు ఈ విధానాలను అనసరించే అవకాశముందని చెబుతున్నారు. జగన్‌ టికెట్లు ఇవ్వని ఎంతో మంది నేతలకు టీడీపీ, జనసేనలో టికెట్లు లభిస్తున్నాయి. జగన్‌ చేసిన ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తాయా..? వ్యతిరేక ఫలితాలకు దారి తీస్తాయా..? అన్నది ఎన్నికలు ఫలితాలు తరువాత తేలనుంది. పలితాలతో సంబంధం లేకుండా ధైర్యంగా జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో సెన్షేషన్‌ అనే చెప్పాలి.