Indian Railways: దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే నడుపుతున్న రైళ్లలో 23.8 శాతం మేర సకాలంలో గమ్యం చేరడం లేదని రైల్వేశాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ అడిగిన  సమాచారానికి ఈ మేరకు రైల్వేశాఖ బదులు ఇచ్చింది. 


దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే నడుపుతున్న రైళ్లలో 23.8 శాతం మేర సకాలంలో గమ్యం చేరడం లేదని రైల్వేశాఖ వెల్లడించింది. 2016 నుంచి 2022 సెప్టెంబరు వరకు 76.20 శాతం రైళ్లు నిర్దిష్ట  సమయంలో గమ్యాన్ని చేరుకున్నాయని తెలిపింది. 


సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ అడిగిన సమాచారానికి రైల్వేశాఖ బదులిచ్చింది. 2016 నుంచి 2022 సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా 76,89,535 సర్వీసులను నడిపినట్లు ఇండియన్‌ రైల్వే పేర్కొంది. ఇందులో 58,59,631 రైళ్లు సకాలంలో నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోగా.. 18, 29,904 సర్వీసులు ఆలస్యమైనట్లు తెలిపింది. ప్రస్తుతం సగటున ప్రతిరోజు 34.20 లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తున్నారని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 694 రాజధాని రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు తెలిపింది. దురంతో 841, శతాబ్ది 285, జనశతాబ్ది 636, మెయిల్/ఎక్స్ ప్రెస్ 23,189, ప్యాసింజర్ రైళ్లు 49,364 ఆలస్యంగా గమ్యానికి చేరినట్టు భారతీయ రైల్వే వివరించింది.


విజయవాడ- సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలు


ఆంధ్రప్రదేశ్‌‌కు వందే భారత్ రైలును కేటాయిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విశాఖ పర్యటనలో ప్రకటించారు. ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ రైలును నడిపేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించిన రైల్వేఅధికారులు సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య వందేభారత్‌ రైలును నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి వందే భారత్ రైలును కానుకగా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


కొత్త ఏడాది కానుకగా


విజయవాడ-సికింద్రబాద్‌ మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిన ఇటీవల బెంగుళూరులో వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా మరో రైలును విజయవాడ-సికింద్రబాద్ మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఉత్తరాదిలో పరుగులు తీస్తున్న వందేభారత్‌ రైళ్లు ఇటీవల చెన్నై-మైసూర్‌ మార్గంలో దక్షిణాదిలోకి ప్రవేశించాయి. కొత్త ఏడాది కానుకగా దక్షిణమధ్య రైల్వేలో పరిధిలో వందేభారత్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దక్షిణమధ్య రైల్వే పరిధిలో వందేభారత్‌ను పట్టాలెక్కించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రస్తుతంసికింద్రబాద్-విజయవాడ రూట్‌లో వందేభారత్‌ను నడపాలని అధికారులు భావిస్తున్నారు.


తగ్గనున్న దూరం


తక్కువ సమయంలోనే రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించేందుకు వందేభారత్‌ను ప్రవేశపెడితే ఆదరణ ఉంటుందని అంచనా వేశారు. సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట్‌ మీదుగా విజయవాడ మార్గాన్ని హైడెన్సిటీ నెట్‌వర్క్‌ పరిధిలోకి తెచ్చారు. 130 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో రైళ్లుప్రయాణించేందుకు వీలుగా ట్రాక్‌ సామర్థ్యాన్ని పెంచారు. ప్రస్తుతం హైడెన్సిటీ నెట్‌వర్క్‌ రూట్లలోనే వందేభారత్‌ రైళ్లు నడుస్తున్న దృష్ట్యా సికింద్రాబాద్‌-విజయవాడ రూట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.