Indian Railway:  మీరు రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా మీ పర్సు ట్రైన్ లో నుంచి పడిపోయిందా! ఒకవేళ అలా పడిపోతే మీరేం చేస్తారు! ఎలా దాన్ని తీసుకుంటారు! ఏముంది. చైన్ లాగితే రైలు ఆగుతుంది. దిగి పడిపోయిన పర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నారా. అలాంటి ఆలోచన వస్తే మాత్రం ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు అలా అలారం చైన్ లాగకూడదు. అలా చైన్ లాగి ట్రైన్ ఆపడం చట్టరీత్యా నేరం. ఈ నేరానికి జరిమానా పడుతుంది. ఒక్కోసారి జైలు శిక్ష పడొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. 


రైలులోని అలారం చైన్ ఎప్పుడు లాగాలి! ఎలాంటి సందర్భాల్లో అలారం చైన్ లాగి రైలును ఆపొచ్చు! అలాగే పర్సు కింద పడిపోతే ఏం చేయాలి! దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి! ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే 2 నిమిషాలు కేటాయించండి. ఈ కథనాన్ని చదివేయండి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలుసుకోండి. 


రైలులోని అలారం చైన్ ఎలాంటి సందర్భాల్లో లాగాలి?



  • ప్రయాణికులు వారి పిల్లల కోసం రైలు ఆపవచ్చు. అంటే వారు రైలు ఎక్కేసి ట్రైన్ కదిలితే పిల్లలు మాత్రం ఇంకా ఎక్కకపోతే అలాంటి సమయంలో చైన్ లాగవచ్చు.

  • రైలుకు మంటలు అంటుకున్నప్పుడు. లేదా రైలులో మంటలు వ్యాపించినప్పుడు.

  • రైలు కదులుతుండగా వృద్ధులు, వికలాంగులు రైలు ఎక్కడానికి సమయం తీసుకుంటున్నప్పుడు చైన్ లాగి రైలును ఆపవచ్చు. 

  • రైలులో ఉన్నవారి ఆరోగ్యం అకస్మాత్తుగా పాడైతే, స్ట్రోక్ లేదా గుండెపోటు వంటివి వస్తే అప్పుడు చైన్ లాగి ట్రైన్ ఆగేలా చేయవచ్చు. 


రైలులో నుంచి పర్స్ పడిపోతే ఏం చేయాలి?


కదులుతున్న రైలులో నుంచి పర్స్ పడిపోతే ఏం చేయాలంటే.. నిర్జన ప్రదేశంలో కనుక పర్సు పడిపోతే 90 శాతం అది దొరుకుతుందని భావించవచ్చు. పర్సు పడిపోయినప్పుడు మీరు రైల్వే ట్రాక్ పక్కనున్న కరెంట్ పోల్ ను చూడాలి. దాని నంబర్ ను నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్పీఎఫ్ హైల్ప్ లైన్ కు కాల్ చేయాలి. మీ పర్సు ఏ స్టేషన్ వద్ద పడిపోయిందో, అక్కడున్న విద్యుత్ స్తంభం నెంబర్ ఎంతో వారికి చెప్పాలి. అప్పుడు ఆర్పీఎఫ్ సిబ్బంది మీ పర్సును వెతికి తీసుకొస్తారు. ఆ తర్వాత మీరు ఆ స్టేషన్ కు తిరిగి వెళ్లి అది మీ పర్సే అని వారికి నమ్మకం కలిగించి దాన్ని తీసుకోవచ్చు. 



  • రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నంబర్  182  (సహాయం కోసం)

  • జీఆర్పీ హెల్ప్ లైన్ నంబర్  1512  (భద్రత కోసం)

  • రైలు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్  138  (ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదురైతే).


వీటన్నింటితో పాటు ట్రైన్ కెప్టెన్, టీటీఈ, ఆర్పీఎఫ్ ఎస్కార్ట్, కోచ్ అటెండెంట్, ఇతర రైల్వే సిబ్బందిని సహాయం కోసం అడగవచ్చు.