మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగనున్న బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో తొలి జాతీయ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 5 నాందేడ్ లోని గురు గోవింద్ సింగ్ మైదానంలో ఈ సభ జరగనుంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిజీగా ఉన్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేందుకు ప్రణాళికలు మొదలు పెట్టిన ఈ సమయంలో నాందేడ్ లో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా పార్టీ నాయకులు రంగంలోకి దిగారు.
  

 

అదిరిపోయే విధంగా సభ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తున్నారు. నాందేడ్ నగరంలోని గురుగోవింద్ సింగ్ మైదానం బీఆర్ఎస్ తొలి రాష్టేతర సభను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి ఆవిర్భావ సభ ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. తర్వాత నాందేడ్ లో సభను నిర్వహించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటివరకు జరిగిన కేసీఆర్ సభలకు ఏమాత్రం తీసిపోకుండా  విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది పార్టీ నాయకత్వం. భారీ బహిరంగ సభ ఏర్పాట్లను వారం రోజులుగా కీలక నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర నాందేడ్ కు దగ్గరగా ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు  చెందిన బిఆర్ఎస్ నేతలు సభను సక్సెస్ చేసే బాధ్యత తీసుకున్నారు. ఎంపీ బిబిపాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్, ఆర్మూర్, జుక్కల్, బోధన్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, షకీల్, సివిల్ స్లపై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు తో పాటు పలువురు బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి  పర్యవేక్షిస్తున్నారు.

 

బీఆర్ఎస్ లో చేరికలకు నేతల సన్నాహాలు 

దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదులుపుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా అనేకమంది ప్రజా ప్రతినిధులు ఇటీవల కేసీఆర్ ను కలిశారు. ఇదే క్రమంలో నాందేడ్ బహిరంగ సభలో పెద్ద ఎత్తున చేరికలు జరిగేలా నేతలు గ్రామాల వారీగా తిరుగుతున్నారు. ఒకవైపు చేరికలపై సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సభకు జనాన్ని తరిలించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, రవీందర్ సింగ్, ఎమ్మెల్యే షకీల్ లు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో చేరికలు జరుగుతున్నాయని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. నాందేడ్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న తరుణంలో సభ ద్వారా సీఎం కేసీఆర్  కీలకమైన ప్రసంగం చేయనున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల దష్ట్యా తొలిసారి పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సభను జరుపుతుండటంతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల దృష్టి నాందేడ్ సభపై పడింది.

 

జన సమీకరణకు నేతల కరసత్తు.. 

నాందేడ్ లో జరిగే సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉండే మహారాష్ట్ర బార్డర్ గ్రామాల నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు ఆయా జిల్లాల నాయకులు కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉండే గ్రామాల నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జహిరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ లు భారీగా జనాలను సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లలో జిల్లా నాయకులు సైతం బీజీగా మారారు. తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ లో ఉండే మహారాష్ట్ర కు చెందిన గ్రామాల ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు గతంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఎమ్మెల్సీ కవితను, ఎమ్మెల్యే షఖీల్ కలిసి తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకోవాలని కోరిన సందర్ఫాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించటంతో తెలంగాణకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రకు చెందిన గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. చేరికలు కూడా భారీ స్థాయిలో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యవాత్మల్ హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తో ఎమ్మెల్యే మైనంపల్లి చర్చలు జరిపారు. అలాగే రెండు రోజుల కిందట రాష్ట్ర మహిళ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల లలిత ఆధ్వర్యంలో నాందేడ్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నేతలు కేసీఆర్ ను కలిసి మద్దతు తెలిపారు.

 

ప్రస్తుత నాందేడ్ జడ్పీ చైర్మన్, మహారాష్ట్ర రాష్ట్ర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సురేష్ అంబులగేకర్, నాందేడ్ జిల్లాలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మెన్లు, మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎంప్లాయ్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బాబురావు పజర్వాడ్, నాందేడ్ టీచర్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్ గంధపవడ్, ధర్మభాధ్ మాజీ మేయర్ దిగంబర్ లక్మావార్ లు కేసీఆర్ తో చర్చలు జరిపారు. నాందేడ్ జిల్లా సరిహద్దులోని యవత్మల్, మహెూర్, కిన్వాట్, నర్సి, దేగ్లూర్, పర్బని తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మరాఠాలను సభకు తరలించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది.