India Pakistan Relations: పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశాలు దాయాది దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచినట్టు కనిపిస్తోంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌ ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. అక్కడ రెండు దేశాల మధ్య స్నేహాలు మెరుగుపడే సంకేతాలు కనిపించాయి. ఈ ప్రపంచస్థాయి వేదికపై నుంచి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకోకుండా ఉండటం ఇదే తొలిసారి. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రెండు దేశాల మధ్య మరిన్ని చర్చలకు సానుకూల చర్యలు తీసుకునే ఛాన్స్ బలంగా ఉంది. 


ABP న్యూస్ జర్నలిస్ట్ ఆశిష్ కుమార్ సింగ్... SCO సమావేశాన్ని కవర్ చేయడానికి ఇస్లామాబాద్‌కు వెళ్లారుయ. SCO సమ్మిట్ ముగిసిన తర్వాత PML(N) చీఫ్, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ షరీఫ్‌తో లాహోర్‌లో మాట్లాడారు.


ఎస్. జైశంకర్ ఇస్లామాబాద్ పర్యటన ప్రభావం ఏంటీ?
SCO శిఖరాగ్ర సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ S. జైశంకర్ వేర్వేరుగా మాట్లారు. ఎక్కడా కూడా ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకోలేదు. ముందస్తు అవగాహనతోనే ఇది జరిగి ఉంటుందని తెలుస్తోంది. భవిష్యత్‌లో సానుకూల చర్యలు తీసుకోవడానికి కొత్త వాతావరణాన్ని సృష్టించడానికి రెండు వైపుల నుంచి కూడా కొంత సుముఖత ఉన్నట్టు స్పష్టమవుతోంది. 


SCO సమ్మిట్ సందర్భంగాపాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇస్లామాబాద్‌లో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విందు కోసం ప్రతినిధులందరికీ షెహబాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అప్పుడు ఆయన డాక్టర్ జైశంకర్‌ను కూడా కలిశారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. కాసేపు ఏదో విషయంపై చర్చలు కూడా చేశారు. ప్రభుత్వ వర్గాలు దీనిని 'వార్మ్ గ్రీటింగ్'గా అభివర్ణించాయి. తర్వాత రోజు ప్రధాన శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. చిరునవ్వుతో మాట్లాడుకున్నారు.


SCO సమ్మిట్ తర్వాత అనధికారిక చర్చలు 
శిఖరాగ్ర సమావేశం తరువాత డాక్టర్ జైశంకర్, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఒకే టేబుల్‌పై భోజనం చేస్తూ కనిపించారు. ఇది అధికారిక చర్చ కానపట్టికీ ఇరుపక్షాల మధ్య ఉన్న ఉద్రిక్తతను తగ్గించి కొత్త వాతావరణం ఏర్పేడేందుకు సానుకూలమని చెప్పవచ్చు. వెయిటింగ్ రూమ్‌లో ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దీని తరువాత డాక్టర్ జైశంకర్ తన సోషల్ మీడియా అకౌంట్‌ X (మొదటి ట్విట్టర్)లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌కు ధన్యవాదాలు తెలిపారు


భారత్-పాక్ సంబంధాలపై నవాజ్ షరీఫ్, మరియం నవాజ్ సానుకూల ఆలోచన 
SCO సమ్మిట్ తర్వాత భారత జర్నలిస్టులు పాకిస్తాన్ మాజీ ప్రధాని, PML(N) చీఫ్ నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ను కలిశారు. నవాజ్ షరీఫ్ భారత్-పాక్ సంబంధాల్లో కొత్త అధ్యయం గురించి మాట్లాడారు. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు చూడాలని 75 ఏళ్లు వృథా చేసుకున్నామని ఇక సమయాన్ని వృథా చేయకూడదని అన్నారు. ఇది కొత్త ఆరంభం కావాలన్నారు. నవాజ్ షరీఫ్ చేసిన ఈ కామెంట్స్‌ భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే పాకిస్థాన్ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి.


కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సంగతిని వదిలివేస్తారా అని ABP న్యూస్ నవాజ్ షరీఫ్‌ను అడిగినప్పుడు... ప్రస్తుతం అలాంటి విషయాలను చర్చించకూడదని అన్నారు. బదులుగా సానుకూల చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. 


క్రికెట్, వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలకు ప్రాధాన్యత 
భారత్, పాకిస్థాన్ మధ్య వాణిజ్య, క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలని నవాజ్ షరీఫ్ సూచించారు. "మేము దుబాయ్ ద్వారా వాణిజ్యం చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నాం. అయితే ఇది నేరుగా చేస్తే రెండు గంటల్లో చేయవచ్చు" అని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను భారత రాష్ట్రాల మధ్య సంబంధాల మాదిరిగానే ఉన్నాయని వివరించారు. నవంబర్‌లో జరిగే COP29 సందర్భంగా ప్రధాని మోదీ, ప్రధాని షరీఫ్‌ కలుసుకోవాలా అని అడిగినప్పుడు... అవును అని సమాధానం చెప్పారు. 


భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు పునఃప్రారంభించాలని షరీఫ్ సూచించారు. జట్లను ఒకరి దేశానికి ఒకరిని పంపకపోవడం వల్ల ఎవరికేం లాభం అని అడిగారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్‌ రావాలా అని అడిగినప్పుడు, "మీరు నా మనసులో మాట చెప్పారు." భారత్‌లో పాకిస్థాన్ జట్టు ఏదైనా ఫైనల్ మ్యాచ్ ఆడితే స్వయంగా ఇండియా వచ్చి మ్యాచ్ చూస్తానని నవాజ్ షరీఫ్ చెప్పాడు.


ఈ సమావేశంలో మరియం నవాజ్ భారతీయ జర్నలిస్టుల పట్ల కూడా ఆప్యాయత చూపారు. పంజాబ్‌లు రెండూ ఉమ్మడి చరిత్ర సంస్కృతిని కలిగి ఉన్నందున తాను భారతదేశాన్ని, ముఖ్యంగా పంజాబ్‌ను సందర్శించాలనుకుంటున్నట్లు చెప్పారు. క్రీడలు, వాతావరణ మార్పుల వంటి రంగాల్లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య సహకారం గురించి నొక్కిచెప్పారు.


SCO శిఖరాగ్ర సమావేశం తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాల్లో సానుకూల సంకేతాలు కనిపించాయి. భారత్‌తో కొత్త సంబంధాల దిశగా అడుగులు వేసేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని నవాజ్ షరీఫ్, మరియం నవాజ్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. ఈ కొత్త హోప్‌ను భవిష్యత్‌లో రెండు దేశాలు ఎలా తీసుకెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది.