భారత-చైనా బలగాల మధ్య మరో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ సమీపంలో భారత బలగాలు దాదాపు 200 మంది సాయుధులైన చైనా బలగాలను నిలువరించినట్లుగా ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో గత వారం ఈ పరిణామం జరిగింది. రోజూ మాదిరిగానే భద్రతా సిబ్బంది వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా.. చైనా సైనికులు భారత భూభాగం వైపు చొచ్చుకొని వస్తుండడాన్ని భారత సైన్యం గుర్తించింది. చైనా సైన్యాన్ని గుర్తించిన భారత సైనికులు వాస్తవాధీన రేఖ అవతలే వారందరినీ నిలువరించగలిగారు. అనంతరం ఇరువైపులా సైన్యం వెనక్కి వెళ్లిపోయింది.
ఇలా వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల సైనికులు కాపుకాసి ఉండడం కొద్ది గంటల పాటు జరిగిందని, అనంతరం ప్రోటోకాల్స్ ప్రకారం రెండు దేశాల వారు పరిష్కరించుకున్నారని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం మొత్తంలో భారత సైనికులకు ఎలాంటి నష్టం కలగలేదని స్పష్టం చేశారు.
Watch: స్పైస్ జెట్ ఎయిర్ హోస్టస్ విమానంలో డ్యాన్స్... నెట్టింట్లో వీడియో వైరల్
మరోవైపు, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా తూర్పు లద్దాఖ్ సహా సరిహద్దు సమస్యలను త్వరగా పరిష్కరించుకొనేందుకు పని చేస్తుందని ఆశిస్తున్నట్లుగా భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చైనా ‘రెచ్చగొట్టే’ తీరు, ‘ఏకపక్ష’ చర్యల వల్ల ఆ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లుతోందని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చీ పునరుద్ఘాటించారు.
Also Read : మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ
చైనా సైనికుల చొరబాట్లకు సంబంధించిన నివేదికల గురించి విలేకరులు ప్రశ్నించగా.. తాను ఆ సైనిక అంశాలపై వ్యాఖ్యానించలేనని.. దానిపై రక్షణ మంత్రిత్వ శాఖ వివరాలు ఇవ్వగలదని చెప్పారు. ‘‘ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ను పూర్తిగా పాటిస్తూ, తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖలో మిగిలిన సమస్యలను ముందుగానే పరిష్కరించడానికి చైనా కృషి చేస్తుందని మేం అనుకుంటున్నాం.’’ అని బగ్చి మీడియా సమావేశంలో అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ గత నెలలో ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తజికిస్తాన్ పర్యటన సందర్భంగా.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా తూర్పు లద్దాఖ్ సమస్యలపై భారతదేశ వైఖరిని తెలియజేశారు.
Also Read : మోదీ జీ.. ఆ నోట్లపై గాంధీ ఫొటో తీసేయండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ