ప్రధాని నరేంద్ర మోదీకి ఓ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసిన ఓ లేఖ వార్తల్లో నిలిచింది. ఈ లేఖలో ఆ ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలు అందిరనీ ఆలోచించేలా చేస్తున్నాయి. రూ.500, రూ.2000 నోట్లపై గాంధీ బొమ్మను తీసేయాలని ఆయన కోరారు. అయితే ఇందుకు కారణమేంటో మీరే చదవండి.
రాజస్థాన్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. జాతిపిత మహాత్మా గాంధీ ఫొటోను రూ.500, రూ.2000 నోట్లపై తీసేయాలని ఈ లేఖలో ఆయన డిమాండ్ చేశారు.
ఆయన సత్యానికి ప్రతీక..
గాంధీని సత్యానికి ప్రతీకగా భరత్ సింగ్ అభివర్ణించారు. అయితే గాంధీ ఫొటో ఉన్న కరెన్సీ నోట్లను చాలా మంది లంచంగా ఇస్తున్నారని ఆయన మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసమే గాంధీ ఫొటోను తీసేసి ఆ స్థానంలో ఆయన కళ్లద్దాలు లేదా అశోక చక్రాన్ని పెట్టాలని కోరారు.
అవినీతి పెరిగిపోతోంది..
75 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో అవినీతి పెరిగిపోయిందని భరత్ సింగ్ అన్నారు. రాజస్థాన్‌లో అవినీతికి పాల్పడుతోన్న ఎంతోమంది అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పట్టుకుంటుందని తెలిపారు. 2019 జనవరి నుంచి 2020 డిసెంబర్ 31 వరకు రెండేళ్లలో దాదాపు 616 అవినీతి ఘటనలను ఏసీబీ వెలికితీసినట్లు ప్రస్తావించారు.
దురపయోగం..
ఇలాంటి అవినీతి ఘటనల్లో ఏసీబీ పట్టుకున్న డబ్బులో దాదాపు ఎక్కువ శాతం రూ.500, రూ.2000 నోట్లే ఉంటున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోట్లను.. బార్లలో, లిక్కర్ పార్టీల్లో కూడా వినియోగిస్తుండటం మహాత్ముడికి గౌరవం కాదన్నారు.
చిన్న నోట్లపై ఓకే..
అయితే చిన్న నోట్లైన రూ.5, రూ.10, రూ.20, రూ. 50, రూ.100, రూ.200పై గాంధీ ఫొటోను ఉంచినా పర్లేదని భరత్ సింగ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఇవి పేదలు ఎక్కువ వినియోగించే నోట్లని ఆయన అన్నారు.
Also Read: Covid 19 Guidelines: పిల్లల భద్రతపై కేంద్రం కొత్త రూల్స్.. పాటించకపోతే పాఠశాలల పని అంతే!
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..