సంపద సృష్టిలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, గుజరాత్ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ పోటీపడుతున్నారు. ఫోర్బ్స్ 2021 భారత కుబేరుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. గతేడాదితో పోలిస్తే వీరి ఆదాయం, సంపద గణనీయంగా పెరిగింది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ గతేడాది భారత బిలియనీర్ల సంపద 50 శాతం పెరగడం ప్రత్యేకం.
Also Read: దిగొచ్చిన పుత్తడి, స్వల్పంగా పెరిగిన వెండి..ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలివే...
ఫోర్బ్స్ జాబితాలోని భారతీయ కోటీశ్వరుల సంపద చివరి 12 నెలల్లో 257 బిలియన్ డాలర్లు పెరిగి 775 బిలియన్ డాలర్లకు పెరిగింది. కొన్ని నెలలుగా స్టాక్‌మార్కెట్లు పరుగులు పెట్టడం, మదుపర్లు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతుండటమే ఇందుకు కారణం. జాబితాలోని 80 శాతం మంది సంపద భారీగా పెరగ్గా... 61 మంది కనీసం ఒక బిలియన్ డాలర్‌కు పైగా సంపద పెంచుకున్నారు.
Also Read: జియో సేవల్లో అంతరాయం.. #jiodown అంటూ యూజర్ల ఫిర్యాదులు
ముకేశ్ అంబానీ సంపద 92.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన 2008 నుంచి ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 74.8 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఒక్క ఏడాదిలోనే ఆయన తన సంపదను అనూహ్యంగా పెంచుకున్నారు. సాఫ్ట్‌వేర్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, స్టీల్ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు టాప్-10లో నిలిచారు.
'కొవిడ్ 19 మహమ్మారి ఉన్నప్పటికీ భారత సామర్థ్యం, ఏదైనా సాధించగలమన్న పట్టుదలను ఈసారి జాబితా ప్రతిబింబించింది. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో భారతీయ కుబేరుల అదృష్టాలు మారాయి. వారు మరింత సంపదను ఆర్జించారు. కోటీశ్వరులు పెరుగుతున్నారు' అని ఫోర్బ్స్ ఆసియా, ఇండియా వెల్త్ ఎడిటర్ నాజ్‌నీన్ కర్మాణి తెలిపారు.
టాప్-10 కుబేరులు వీరే
* ముకేశ్ అంబానీ (92.7 బిలియన్ డాలర్లు)
* గౌతమ్ అదానీ (74.8 బిలియన్ డాలర్లు)
* శివ నాడార్ (31 బిలియన్ డాలర్లు)
* రాధాకిషన్ దమాని (29.4 బిలియన్ డాలర్లు)
* సైరస్ పూనావాలా (19 బిలియన్ డాలర్లు)
* లక్ష్మీ మిత్తల్ (18.8 బిలియన్ డాలర్లు)
* సావిత్రీ జిందాల్ (18 బిలియన్ డాలర్లు)
* ఉదయ్ కొటక్ (16.5 బిలియన్ డాలర్లు)
* పల్లోంజి మిస్త్రీ (16.4 బిలియన్ డాలర్లు)
* కుమార్ మంగళం బిర్లా (15.8 బిలియన్ డాలర్లు)