Hottest Month August: ఈ ఏడాది ఆగస్టు నెల అత్యంత వేడిగా, పొడిగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. జులై 2023.. 1.20 లక్షల సంవత్సరాలలో అత్యంత వేడి నెల అని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. జులై తర్వాత వచ్చిన ఆగస్టు నెల కూడా అత్యంత వేడిగా, పొడిగా ఉన్న ఆగస్టు నెలగా నిలిచినట్లు ఐఎండీ పేర్కొంది. 1901 తర్వాత ఈ ఏడాది ఆగస్టు నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, వాతావరణం చాలా పొడిగా ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితికి ప్రదాన కారణం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాత లోటు, బలహీనమైన రుతుపవనాలు నమోదు కావడమేనని వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసినప్పటికీ.. మొత్తంగా చూసుకుంటే వర్షాపాతం లోటులోనే ఉన్నట్లు తెలిపింది.


ఐఎండీ ప్రకారం, ఈ సంవత్సరం ఆగస్టులో భారత్ లో సగటున 161.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో భారత్ లో నమోదైన అత్యల్ప సగటు వర్షపాతం ఇదే. అంతకు ముందు 2005 ఆగస్టులో నమోదైన సగటు వర్షపాతం కంటే 2023 ఆగస్టులో నమోదైన సగటు వర్షపాతం 30.1 మిల్లీమీటర్లు తక్కువ.






వర్షాకాలం వచ్చిన మొదట్లో కాస్త ఆలస్యంగా వానలు కురిసినప్పడికీ.. ఆ తర్వాత భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ వరుణుడు కనిపించకుండా పోయాడు. ఎండాకాలంలో మండినంత స్థాయిలో సూర్యుడు మండిపోతున్నాడు. వానాకాలం సీజన్ మూడు నెలలు గురువారం రోజుతో ముగిసిపోయాయి. దీంతో అన్నదాతలు ఆగమైపోతున్నరు. పంట సాగులో తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. జూన్‌ నెల వర్షాభావంతో మొదలు కాగా.. జులైలో అధిక వర్షాలు, వరదలు సాగుకు తాత్కాలికంగా ఆటంకంగా మారాయి. అయితే వర్షాలు పడినప్పుడు నిండిన వాగులు, వంకలు, చెరువుల వల్ల కొద్దో గొప్పో పంటలసాగు మొదలు అయింది. ప్రస్తుతం వరినాట్లు కూడా పూర్తి అవుతున్నాయి. మొక్కజొన్న, పత్తి వంటి ఇతర పంటలు మొలకల దశలో ఉన్నాయి. వీటికి వర్షాల అవసరం ఎక్కువగా ఉంది. కానీ ఆగస్టు నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. 


Also Read: Guinness Records: గిన్నిస్ బుక్‌లో నల్గొండ యువతి, లక్ష పేజీల పుస్తకానికి 200 ఆర్టికల్స్ తో రికార్డ్


ఈ ఏడాది వర్షా కాలంలో మొత్తం అంటే 92 రోజుల్లో 43 రోజుల పాటు వర్షాలు కురిశాయి. 579.9 మిల్లీ మీటర్ల వర్షానికి గాను 642.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇలా 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సంఖ్యల పరంగా చూస్తుంటే వర్షం ఎక్కువగా నమోదు అయినట్లు కనిపిస్తున్నా.. ఒక నెలలో అతివృష్టి తప్పు అవసరమైన సమయాల్లో అసలు వర్షమే కురవలేదు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు అయింది.


ఈ సంవత్సరం నీటి సమస్యలు తప్పేలా లేవు. గతేడాది ఈ సమయానికి నిండుకుండలా ఉన్న రాష్ట్రంలోని జలాశయాలు ఇప్పుడు నీరు లేక వెలవెలబోతున్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాజెక్టుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ వర్షాకాలంలో సగటు వర్షాపాతం కూడా నమోదు కాకపోవడం, ఎగువ నుంచి కూడా ఆశించిన స్థాయిలో ప్రవాహం రాకపోవడంతో ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. సాగు నీటికి, తాగు నీటికి ఇబ్బందులు పడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ లో కూడా వర్షాలు లేకపోతే.. ఇక సంవత్సరమంతా నీటికి ఇబ్బందిపడాల్సిందేనని ఆందోళన వ్యక్తం అవుతోంది.