India vs Bharat Row: 



భారత్‌గా మారి తీరుతుంది: దిలీప్ ఘోష్


కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఇండియా పేరుని భారత్‌గా మార్చేస్తుందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పరోక్షంగా ఈ సంకేతాలిచ్చింది. G20 సదస్సులోనూ ప్రధాని మోదీ కూర్చున్న చోట నేమ్‌ప్లేట్‌పై "Bharat" అని కనిపించడం వల్ల దీనిపై చర్చ మరింత పెరిగింది. ఈ సదస్సు మొత్తంలోనూ బీజేపీ ఎక్కడా ఇండియా అనే పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడింది. ప్రతి చోటా భారత్ అనే పేరునే ప్రమోట్ చేసింది. అటు విపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఈ వివాదం ముదురుతున్న క్రమంలోనే పశ్చిమబెంగాల్‌కి చెందిన బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరు భారత్‌గా కచ్చితంగా మారి తీరుతుందని, ఇది ఇష్టం లేని వాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. ఖరగ్‌పూర్‌లో ఛాయ్‌ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసిన దిలీప్ ఘోష్...భారత్ అనే పేరు పెట్టడాన్ని సమర్థించారు. బెంగాల్‌లో కొందరి విదేశీయుల విగ్రహాలు పెట్టారని, తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ తొలగిస్తామని వెల్లడించారు. 


విపక్షాల విమర్శలు..


మరో సీనియర్‌ నేత రాహుల్ సిన్హా కూడా భారత్‌ అని పేరు మార్చడాన్ని సమర్థించారు. దేశానికి రెండు పేర్లు ఉండడం సరికాదని, భారత్‌ అనే పేరు ఖరారు చేసుకోవడం సబబే అని స్పష్టం చేశారు. G20 సదస్సులో భారత్ పేరుని ప్రమోట్ చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. దేశంలో ఇన్ని సమస్యలుంటే, పేరు గురించి అనవసరపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


G20 సదస్సులో మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్‌ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది. విపక్షాలు దీనిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండి పడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్ అని కనిపించడం వల్ల కేంద్రం అందుకు సిద్ధంగానే ఉందని సంకేతాలిచ్చినట్టైంది. ఈ వివాదంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై విరుచుకు పడ్డారు. ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగాన్ని మార్చాలని తేల్చి చెప్పారు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే...రాజ్యాంగాన్ని మార్చాలని సవాల్ విసిరారు. రాజ్యాంగాన్ని మార్చే విషయంలో ఎవరు బీజేపీకి మద్దతుగా ఉంటుందో చూస్తామని అన్నారు. ఎవరూ ఇండియా పేరుని మార్చలేరని స్పష్టం చేశారు. 


Also Read: Bengaluru Bandh: బెంగళూరులో ప్రైవేట్ బస్‌లు ట్యాక్సీలు బంద్, గవర్నమెంట్ స్కీమ్‌తో గిరాకీ నిల్