Bengaluru Bandh:
ప్రైవేట్ వెహికిల్స్ బంద్
కర్ణాటక ప్రైవేట్ వెహికిల్స్ ఓనర్స్ అసోసియేషన్ బెంగళూరులో బంద్‌కి పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి స్కీమ్‌ని నిరసిస్తూ బంద్‌కి పిలుపునిచ్చినట్టు వెల్లడించింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో శక్తి స్కీమ్ ఒకటి. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తూ ఈ పథకం ప్రవేశపెట్టింది. ఇప్పటికే దీనిపై చాలా వాదనలు జరుగుతున్నాయి. ఈ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ వెహికిల్స్‌కి గిరాకీ బాగా తగ్గిపోయింది. ఈ ఫెడరేషన్‌లో మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ సంఘాలకు చెందిన వాహనాలన్నీ అందుబాటులో ఉండవని తేల్చి చెప్పారు ప్రతినిధులు. ఇవాళ మధ్యరాత్రి (సెప్టెంబర్ 11) వరకూ ఈ బంద్ కొనసాగనుంది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ బంద్‌కి అనుగుణంగా ప్రకటనలు చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. బంద్ ఎందుకని ప్రశ్నించగా తమ డిమాండ్‌లు వినిపించింది ఫెడరేషన్. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించాలని తేల్చి చెప్పింది. అంతే కాదు. ప్రైవేట్ బస్సులకూ శక్తి స్కీమ్‌ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ప్రభుత్వంతో ఎన్నో సార్లు చర్చలు జరిపినా లాభం లేకుండా పోయిందని చెబుతున్నారు ప్రతినిధులు. ప్రభుత్వ పథకం తమ పొట్ట కొడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై రాష్ట్ర రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పందించారు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ రూ.1000 కోట్ల పరిహారం అడుగుతున్నారని వివరించారు.
"ఈ వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ కొన్ని అంశాలు విచారణలో ఉన్నాయి. నా చేతుల్లో ఉన్నది నేను చేశాను. నేను పరిష్కరించే సమస్యలు మాత్రమే నేను పట్టించుకోగలను"
- రామలింగా రెడ్డి, కర్ణాటక రవాణా మంత్రి
ఈ బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. బస్‌ల సంఖ్య పెంచినట్టు రామలింగా రెడ్డి ప్రకటించారు. అదనపు బస్‌లను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
"BMTC తరపున అదనపు బస్‌లు ఏర్పాటు చేశాం. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. 500 అదనపు బస్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎలాంటి అసౌకర్యం కలగదు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఫెడరేషన్ వాళ్లకు నిరసన తెలిపే హక్కుంది. వాళ్ల పని వాళ్లను చేయనివ్వండి"
- రామలింగా రెడ్డి, కర్ణాటక రవాణా మంత్రి
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీల్లో కీలకమైంది...మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. "శక్తి యోజనే" (Shakti Yojane) పథకంలో భాగంగా ఇది అమలు చేస్తామని చెప్పారు సీఎం సిద్దరామయ్య. జూన్ 11న అధికారికంగా ఈ స్కీమ్‌ని ప్రారంభించారు. బెంగళూరులోని విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ పథకాన్ని లాంఛ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ బస్‌లలో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ శక్తి స్కీమ్ కేవలం ఆర్డినరీ బస్‌లకు (BMTC) మాత్రమే వర్తించనుంది. వేరే రాష్ట్రానికి ట్రావెల్ చేసే వాళ్లకు ఈ స్కీమ్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. KSRTC, KKRTCకి చెందిన బస్‌లలో 50% సీట్లు పురుషులకే కేటాయించింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు ఈ స్కీమ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ...ప్రభుత్వం మాత్రం తాము ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు స్పష్టం చేసింది.
Also Read: భగవద్గీత ఉపనిషత్తులు చదివాను, హిందూయిజానికి బీజేపీ సిద్ధాంతాలకి పొంతనే లేదు - రాహుల్ ఫైర్