Udhayanidhi Stalin: 


ఉదయనిధి స్టాలిన్‌ కామెంట్స్..


సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగలేదు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ నేతలు వరుస పెట్టి కౌంటర్‌లు ఇస్తూనే ఉన్నారు. అయినా...ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. పైగా పదేపదే ఇంకా కవ్విస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి డైరెక్ట్‌గా బీజేపీనే టార్గెట్ చేశారు. బీజేపీ ఓ విషసర్పం అని మండి పడ్డారు. DMK ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షమైన AIDMKపైనా విమర్శలు చేశారు. AIDMK పార్టీ చెత్తలాంటిదైతే...అందులోని పాము బీజేపీ అని సెటైర్లు వేశారు. ఇప్పటికే డీఎమ్‌కే ఎంపీ ఎ. రాజా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీయే విషసర్పం అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ బీజేపీని విషసర్పంతో పోల్చారు. 


"ఓ విషసర్పం మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కేవలం దాన్ని పట్టుకుని బయటకు వదలడం మంచిది కాదు. మళ్లీ అది ఏదో ఓ మూల నుంచి ఇంట్లోకి వచ్చి నక్కి ఉంటుంది. మీ ఇంట్లో చెత్తను శుభ్రం చేసుకోనంత వరకూ అది అక్కడే ఉంటుంది. ఇదే ఉదాహరణను తమిళనాడు పరిస్థితులతో పోల్చి చెబుతున్నాను. తమిళనాడు మన ఇల్లు లాంటిది. ఇక్కడ AIDMK చెత్త కుప్ప అయితే...బీజేపీ విషసర్పం. ఆ చెత్తను తొలగిస్తే తప్ప ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోదు. బీజేపీ నుంచి విముక్తి కలగాలంటే AIDMKనీ తుడిచి పెట్టేయాలి"


- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి 


డీఎమ్‌కే నేతలందరినీ ఉద్దేశించి ఇప్పటికే ఓ నోట్ విడుదల చేశారు ఉదయనిధి స్టాలిన్. అనవసరంగా ఈ వివాదాన్ని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. తనపై విమర్శలు చేసిన వాళ్లపై కేసులు పెట్టడం, వాళ్ల దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం లాంటివి చేయొద్దని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి సహా అయోధ్యకు చెందిన సాధువు మహంత్ పరమహన్స్‌పైనా విమర్శలు చేశారు. తన తలను తీసుకొచ్చిన వారికి నజరానా ఇస్తారనని మహంత్ పరమహన్స్‌ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. పెరియార్, అన్నా, కలైజ్ఞర్, పెరసిరియార్ చూపిన బాటలోనే అందరూ నడుద్దాం అంటూ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయంపై తనకు నమ్మకముందని తేల్చి చెప్పారు. మణిపూర్‌ లాంటి అతి పెద్ద సమస్యని వదిలేసి తన వ్యాఖ్యలతో రాజకీయం చేస్తోందని బీజేపీపై మండి పడ్డారు. కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారని, తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 9 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో తన కొడుకునే సమర్థించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్. ఉదయనిధి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వాటిని తప్పుదోవ పట్టించారని తేల్చి చెప్పారు.


Also Read: భగవద్గీత ఉపనిషత్తులు చదివాను, హిందూయిజానికి బీజేపీ సిద్ధాంతాలకి పొంతనే లేదు - రాహుల్ ఫైర్