India Vs Bharat Controversy: దేశం పేరు భారతా.. ఇండియానా.. అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరికొన్ని రోజుల్లో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు దేశం పేరు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ చర్చకు కారణమైంది జీ20 సమ్మిట్. ఎలాగంటే.. దేశంలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా వివిధ దేశాల అధినేతలకు భారత ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ఆ ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉంది. దీంతో వివాదం చెలరేగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశం పేరు మార్చబోతుందా అనే చర్చ మొదలైంది. దీనిపై కేంద్ర సర్కారును ట్రార్గెట్ చేసుకుని ప్రతిపక్షాల దాడి చేస్తున్నాయి.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సెప్టెంబర్ 9న జరగనున్న జీ20 సమావేశానికి ఆహ్వాన లేఖల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1పై దాడి చేయడమేనని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా?
సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఇండియా అనే పదాన్ని తొలగించే ప్రతిపాదనకు సంబంధించిన బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు బీజేపీ ఎంపీ హర్నామ్ సింగ్ మాట్లాడుతూ.. ఇండియా అనే పదానికి బదులుగా భారత్ అనే పదాన్ని ఉపయోగించాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తోందని అన్నారు. బ్రిటీష్ వారు ఇండియా అనే పదాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. భారత్ అనే పదం మన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. రాజ్యాంగంలో మార్పు రావాలని, అందులో భారత్ అనే పదాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగంలో ఉన్నదేంటి?
రాజ్యాంగంలోని ఆర్టికల్-1లో మాత్రమే దేశం పేరు ప్రస్తావించారు. ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్ అని పేర్కొన్నారు. దేశాన్ని అధికారికంగా ఏమని పిలుస్తారో తెలిపే రాజ్యాంగంలోని నిబంధన ఇదొక్కటే. దీని ఆధారంగా దేశాన్ని హిందీలో భారత్ రిపబ్లిక్ అని, ఇంగ్లీష్ లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని రాశారు.
1949 సెప్టెంబర్ 18వ తేదీన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో సభ్యులు కొత్తగా ఏర్పడిన దేశానికి పేరు పెట్టడం గురించి చర్చించారు. ఈ సమయంలో అసెంబ్లీ సభ్యుల నుంచి వివిధ పేర్లు సూచించారు. భారత్, హిందుస్థాన్, హింద్, భరత్ భూమిక్, భరతవర్ష్ అంటూ పలు పేర్లు సూచించారు.