లింగ సమానత్వంలో భారత దేశం అట్టడుగు స్థానంలో నిలిచింది. మొత్తం 146 దేశాలకు చెందిన జాబితాను విడుదల చేయగా అందులో భారత్ స్థానం 135. మరో 11 దేశాలు మాత్రమే భారత్ తర్వాత ఉన్నాయంటే మన దేశ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.


నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి మన పొరుగు దేశాలు కూడా మన కంటే మెరుగైన స్థానంలోనే నిలిచాయి. వరల్డ్ ఎకానమిక్ ఫోరం విడుదల చేసిన ఈ రిపోర్టులో భారత్ తర్వాతి స్థానంలో తాలిబన్లు పాలన సాగిస్తున్న అఫ్గానిస్థాన్, దివాళా అంచున నిల్చున్న పాకిస్థాన్ సహా కాంగో, ఇరాన్, చాడ్ లాంటి దేశాలు ఉన్నాయి. 


ఐస్‌ లాండ్


ఎప్పట్లేగా ఐస్ లాండ్ లింగ సమానత్వంలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఫిన్ లాండ్, తర్వాత స్థానాల్లో వరుసగా నార్వే, న్యూజిలాండ్, స్వీడెన్ దేశాలు ఉన్నట్లు వరల్డ్ ఎకానమిక్ ఫోరం విడుదల చేసిన నివేదికలో ఉంది. శ్రామిక శక్తిలో పెరుగుతున్న లింగ అంతరంతో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయ సంక్షోభం మహిళలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రిపోర్టు హెచ్చరించింది, లింగ అంతరాన్ని పూడ్చడానికి 2021లో 136తో పోలిస్తే.... 132 సంవత్సరాలు పడుతుందని డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది.


కోవిడ్-19 లింగ సమానత్వాన్ని ఒక తరం వెనక్కి నెట్టిందని తెలిపింది. ఇప్పటికే సమానత్వం దిశగా మెల్ల మెల్లగా కదులుతుండగా... అది మరింత దిగజారిందని నివేదిక పేర్కొంది. గత 16 ఏళ్లలో భారతదేశం యొక్క లింగ వ్యత్యాస స్కోర్.. ఏడో అత్యధిక స్థాయిని నమోదు చేసినప్పటికీ, పలు ప్యారామీటర్స్ లో చెత్త దేశాలతో ర్యాంక్‌ను కొనసాగిస్తున్నట్లు రిపోర్టు వెల్లడించింది. సుమారు 662 మిలియన్ల మహిళా జనాభా దేశంలో ఉంది. భారత్ సాధించిన స్థాయి ప్రాంతీయ ర్యాంకింగ్‌లపై ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2021 నుండి భారతదేశం పుంజుకున్నట్లు WEF నివేదిక పేర్కొంది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలపై భారత్ పని తీరులో అత్యంత ముఖ్యమైన అలాగే సానుకూల మార్పును నమోదు చేసిందని నివేదిక పేర్కొంది. కానీ, 2021 నుండి పురుషులు, మహిళలు ఇద్దరికీ కార్మిక-శక్తి భాగస్వామ్యం తగ్గిపోయింది.


అయితే మహిళా శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల వాటా 14.6 శాతం నుంచి 17.6 శాతానికి పెరగడం విశేషం. వృత్తి పరమైన, సాంకేతిక కార్మికులుగా మహిళల శాతం 29.2 శాతం నుండి 32.9 శాతానికి పెరిగింది. అంచనా వేసిన ఆదాయానికి లింగ సమానత్వ స్కోర్ మెరుగుపడింది. పురుషులు, మహిళలు ఇద్దరికీ విలువలు క్షీణించాయి. ప్రాథమిక, తృతీయ విద్యా నమోదులో లింగ సమానత్వంలో భారత దేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది. రాజకీయ సాధికారతలో భారత దేశం 48వ స్థానం నిలిచింది. మహిళలు గత 50 సంవత్సరాలుగా దేశాధినేతగా పని చేసిన సంవత్సరాల్లో తగ్గుతున్న వాటా కారణంగా స్కోర్ క్షీణించింది. 


లింగ అంతరాలున్న దేశంలో ఇండియా..


ఆరోగ్యం, మనుగడ ఇండెక్స్ లో, భారత దేశం 146వ ర్యాంకుతో అత్యల్ప స్థానంలో నిలిచింది. అలాగే 5 శాతం కంటే ఎక్కువ లింగ అంతరాలు ఉన్న ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. మిగిలిన నాలుగు దేశాలు ఖతార్, పాకిస్థాన్, అజర్‌ బైజాన్ తో పాటు చైనా అని నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ తర్వాత భారత దేశం మొత్తం ఆరో అత్యుత్తమ ర్యాంక్‌ ను సాధించింది. ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ భారత్ కంటే దారుణమైన ర్యాంకులో నిలిచాయి. 62.3 శాతంతో దక్షిణాసియా మిగిలిన అన్ని ప్రాంతాలలో అతి పెద్ద లింగ అంతరాన్ని కలిగి ఉందని వరల్ట్ ఎకానమిక్ ఫోరం నివేదిక పేర్కొంది. ప్రస్తుత వేగం ప్రకారం...  ఈ ప్రాంతంలో లింగ అంతరాన్ని పూడ్చడానికి 197 సంవత్సరాలు పడుతుందని రిపోర్టు తేల్చింది. బంగ్లాదేశ్, భారత్ అలాగే నేపాల్‌ సహా పలు దేశాల్లో వృత్తి పరమైన సాంకేతికతలో మహిళల వాటా పెరుగుదలతో ఆర్థిక లింగ అంతరం 1.8 శాతం తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 146 దేశాల్లో సర్వే చేయగా.... అందులో కేవలం ఐదు దేశాలు మాత్రమే లింగ అంతరాన్ని కనీసం 1 శాతం తగ్గించాయని వరల్డ్ ఎకానమిక్ ఫోరం తెలిపింది. మహమ్మారి కూడా మహిళలపై తీవ్రమైన ప్రభావం చూపిందని WEF పేర్కొంది.