Monkeypox News | న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ (Monkeypox)పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల కారణంగా భారత్ సైతం మంకీపాక్స్ వ్యాధిపై అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్ (MPox)పై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్ లో ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని, భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని తాము అంచనా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
మంకీపాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై హైలెవల్ మీటింగ్‌లో ఉన్నతాధికారులతో డా. పీకే మిశ్రా చర్చించారు. ఎంపాక్స్ వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబులను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంకీపాక్స్ (MPox) వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయాలని సూచించారు.
2022లో 116 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 99,176 మందికి మంకీపాక్స్ సోకగా 208 మంది మృతి చెందారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. కాంగో దేశంలో ఈ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయని.. 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 537 మంది మృతిచెందారు. ఎంపాక్స్ వేగంగా వ్యాపిస్తుందని, దీని కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, సలహాలు, సూచనలు త్వరలోనే విడుదల చేస్తామని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఆఫ్రికా దేశాలతో పాటు పాకిస్తాన్, స్వీడన్ సహా మరికొన్ని దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదు కాగా, మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. 95 నుంచి 98 శాతం ఎంపాక్స్ కేసులు ఆఫ్రికాలో, ముఖ్యంగా కాంగోలోనే నమోదవుతున్నాయి.
మొదటి కేసు నమోదైంది ఎప్పుడంటే..
మంకీపాక్స్ అనేది కరోనా వ్యాప్తి లాంటిది కాదు, కానీ ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది జంతువులతో పాటు మానవులను సైతం ప్రభావితం చేస్తుంది. ఆర్తోపాక్స్ వైరస్ జాతికి చెందినదిగా ఎంపాక్స్‌ను గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారికి చర్మంపై గడ్డలు, పొక్కులు లాగ వచ్చి, దురద పెడుతుంది. ఎంపాక్స్‌ను తొలిసారిగా 1958లో కోతులలో గుర్తించారు. కోతులలో తొలిసారి గుర్తించడంతో దీనికి మంకీపాక్స్ అని నామకరణం చేశారు. ఆపై 1970లో ఏడాదిలోపు వయసున్న ఓ బాలుడికి మంకీ ఫాక్స్ వచ్చినట్లు తొలి కేసు నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో ఈ మంకీపాక్స్‌ను ఎంపాక్స్‌గా నామకరణం చేసింది.
Also Read: పాకిస్థాన్‌లో తొలి Mpox కేసు నమోదు, ఇండియాకీ ముప్పు పొంచి ఉందా?