Huge Fish Caught In The Fisherman's Net : వేటకు వెళ్లే మత్స్యకారులకు ఒక్కోసారి భారీ చేపలు చిక్కుతుంటాయి. వాటిని ఒడ్డుకు తెచ్చేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదివారం వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారుల వలకు అటువంటి అరుదైన భారీ చేప చిక్కింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోనసీమ జిల్లా అంతర్వేది ప్రాంతానికి చెందిన 30 మంది జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా వేముల దీవికి చెందిన బలంగం వెంకటేశ్వర్లు బోటుపై కాకినాడకు చెందిన మత్స్యకారులంతా సముద్రంలో వేటాడుతున్నారు. ఈ క్రమంలోనే వీరి వలకు భారీ చేప చిక్కింది. భారీ సైజులో ఉండడంతోపాటు బరువు కూడా అధికంగా ఉండడంతో చేపను బయటకు తీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద హార్బర్‌కు తీసుకువచ్చిన మత్స్యకారులు 30 మంది జాలర్లు తాళ్ల సాయంతో జేసీకి కట్టి ఒడ్డుకు చేర్చారు. ఈ చేపటకు అంతర్వేదిలో అధిక రేటు వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. వెంటనే ప్రత్యేక వాహనాన్ని సమకూర్చుకుని కాకినాడ కుంభాభిషేకం రేవుకు తీసుకెళ్లేందుకు మత్స్యకారులు ఏర్పాట్లు చేశారు.
ఈ చేపను టేకు చేపగా పేర్కొంటారు. సుమారు వేయి కేజీలు బరువు ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా కొన్ని రకాల మత్స్య సంపదను ఔషదాల తయారీకి వినియోగిస్తారు. ఈ టేకు చేపను మాత్రం ఔషదాలకు వినియోగించే అవకాశం ఉండదు, దీన్ని ఉప్పు పట్టి విక్రయిస్తారు. తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. సుమారు రూ.60 నుంచి రూ.70 వేలు వరకు మార్కెట్‌లో పలుకుతుందని మత్స్యకారులు వెల్లడించారు. కాకినాడ కుంబాభిషేకానికి మత్స్యకారులు తీసుకెళ్లారు.