Konaseema Crime News: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఆరు నెలలుగా ప్రేమలో మునిగి తేలారు.. చివరకు దూరంగా వెళ్లిపోయి సహజీవనం సాగించారు.. సీన్ కట్ చేస్తే అతడి టార్చర్ భరించలేని స్థితిలో తిరిగి ఇంటి బాటపట్టింది.. జరిగిన విషయం అన్నకు చెప్పిందా యువతి.. పగతో రగలిపోయిన అన్న, అతని స్నేహితులతో కలిసి స్కెచ్ వేసి కొట్టి చంపి గొదాట్లోకి తోసేశారు.. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది.. యువకుని అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పరిధిలోని మల్కిపురంలో తన కుమారుడు పడమటి నోయల్ జార్జ్ కనిపిండం లేదంటూ గుడిమెల్లంక ప్రాంతానికి చెందిన పడమటి రత్నంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల తరువాత సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం వద్ద నోయల్ జార్జ్ మృతదేహం లభ్యమయ్యింది.. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. మృతుని సెల్‌ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతనికి చివరిగా వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా కేసులో మరింత లోతుకు వెళ్లారు. ఈ ఆధారంతోపాటు మృతుని తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు గుడిమెళ్లంక ప్రాంతానికి చెందిన రాపాక ప్రశాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా మర్డర్ వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది
గంజాయి తాగమని హింసించేవాడు...
కాకినాడలో ప్రశాంతి, నోయల్ జార్జ్ ఇద్దరూ కలిసి సహజీవనం సాగించేవారు.. ఈ క్రమంలోనే నోయల్ జార్జ్ మద్యానికి బాగా బానిసై ప్రశాంతిని వేధింపులకు గురిచేసేవాడు.. అంతేకాకుండా సిగరెట్లు, గంజాయికూడా సేవించి తనతోపాటు ప్రశాంతిని కూడా తాగమని ఇబ్బంది పెట్టి మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడు. దీంతో ప్రశాంతి ఈ బాధలు తట్టుకోలేక ఈనెల 9న కాకినాడ నుంచి ఇళ్ల అన్నయ్య రాపాక ప్రకాష్ వద్దకు మలికిపురం వచ్చేసింది. కాకినాడలో నోయల్ జార్జ్ తనను ఏవిధంగా హింసించేవాడో అన్నయ్య రాపాక ప్రకాష్‌కు తెలిపింది.దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ప్రకాష్ రాజోలుకు చెందిన తన స్నేహితుడైన యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్ తో విషయం చర్చించి రాపాక ప్రశాంతి ముగ్గురూ కలిసి నోయల్ జార్జ్‌ను మట్టుపెట్టాలని పథక రచన చేశారు..
రమ్మని పిలిచి చంపేశారు
తన చెల్లిని హింసించిన నోయల్ జార్జ్‌ను అంతమొందించాలని పథక రచన చేసిన ప్రకాష్.. ప్రశాంతి చేత దిండి`చించినాడ బ్రిడ్జి వద్దకు రావాలని ఫోన్ చేయించారు. అతను అక్కడకు రావడంతో ముందు అనుకున్న ప్రకారం ఇనుపరాడ్లుతో నోయల్ జార్జిని కొట్టి చంపి గోదావరిలో పడవేశారు. నోయల్ వేసుకొచ్చిన బండిని బ్రిడ్జి వద్ద పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈక్రమంలోనే తన కుమారుడి బైక్ చించినాడ బ్రిడ్జిపై బండి ఉందని సమాచారం తెలుసుకున్న తండ్రి రత్నంరాజు మలికిపురం పోలీసులకు తనకుమారుడు అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 13న నోయల్ మృతదేహం అంతర్వేది పల్లిపాలెం వద్ద నదీసాగర సంగమం వద్ద లభ్యమయ్యింది. దర్యాప్తులో భాగంగా నోయల్ జార్జితో సహజీవనం చేసిన ప్రశాంతిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు హత్యోదంతం బహిర్గతం అయ్యింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.