భారత్ చేపట్టిన టీకా డోసుల కార్యక్రమం వంద కోట్లకు దాటింది. నేడు భారత్ ఈ కీలక ఘట్టానికి చేరుకుంది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. ఇవాళ్టి ఉదయ నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్‌ల టీకాలు వేశారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌తోనే ఈ విజయం సాధ్యమయిందని మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. 


కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి.. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభమైంది.






అయితే మెుదట వ్యాక్సినేషన్ పై సరైన అవగాహన లేకపోవడం, వేరే కారణాలతో టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగింది. కరోనా సెకండ్ వేవ్ నుంచి వ్యాక్సినేషన్ ఊపందుకుంది. జూన్‌ నెలాఖరులో రోజుకు 40 లక్షల డోసులు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 17న 2.5కోట్ల డోసులను వేశారు.






100 కోట్ల వ్యాక్సినేషన్‌ను ఘనంగా జరిపేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 100 వారసత్వ కట్టడాలపై భారత జాతీయ పతాకంలోని మూడు రంగులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల సేవల కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వంద కోట్ల డోసులను పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం చైనా. అమెరికా, బ్రెజిల్‌, ఇండోనేషియా దేశాలు భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


Also Read: Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి