IT Recovers 65 Crores From Congress Account: కాంగ్రెస్ ఖాతా నుంచి ఆదాయపు పన్ను శాఖ బుధవారం రూ.65 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ మొత్తం రూ.115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. పార్టీ బ్యాంక్ ఖాతా నుంచి ప్రస్తుతానికి రూ.65 కోట్లు రికవరీ చేసింది. అయితే, ఐటీ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న తమ ఖాతాల నుంచి రూ.65 కోట్లను ఐటీ శాఖ అప్రజాస్వామికంగా డబ్బు విత్ డ్రా చేసిందని ఆరోపించింది. పన్ను రికవరీకి సంబంధించిన అంశం న్యాయ పరిధిలో ఉన్నా.. ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. దీనిపై ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన స్టే దరఖాస్తు వ్యవహారం తేలే వరకూ ఆదాయపు పన్ను శాఖ చర్యలను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ట్రైబ్యునల్ ఆదేశించింది.
అటు, ఐటీ తీరును కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం అంతమై పోతుందని పేర్కొన్నారు. 'మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఖాతాల జప్తుపై ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ విచారణ చేపడుతున్నా.. వివిధ బ్యాంకుల్లోని కాంగ్రెస్ ఖాతాల నుంచి రూ.65 కోట్లు విత్ డ్రా చేయాలని ఐటీ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ఈ కేసు న్యాయ పరిధిలో ఉన్నందున నగదును విత్ డ్రా చెయ్యొద్దని బ్యాంకులకు మా పార్టీ తరఫున లేఖ రాశాం. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి కాంగ్రెస్ బలి పశువుగా మారింది.' అని అన్నారు.
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపచేయడం ఒక్కసారిగా అలజడి సృష్టించింది. అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ తమను కావాలనే టార్గెట్ చేసి ఐటీ శాఖ ఇలా ఆంక్షలు విధించిందని.. దీనిపై ట్యాక్స్ ట్రిబ్యునల్ ను (Tax Tribunal) ఆశ్రయించింది. అనంతరం, ఖాతాలు ఫ్రీజ్ అయినప్పటికీ వాటిని పార్టీ వినియోగించుకోవచ్చని ట్రిబ్యునల్ వెల్లడించింది. ఆ ఖాతాలపై ఐటీశాఖకు న్యాయపరమైన హక్కులు మాత్రమే ఉంటాయని, వాటిని ఆపరేట్ చేసుకోడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పింది. అయితే, తాజాగా ఐటీ కాంగ్రెస్ ఖాతాల్లో మనీ రికవరీ చేయడంతో ఆ పార్టీ అభ్యంతరం తెలిపింది.
Also Read: Rajya Sabha Elections: పెద్దల సభకు పోటీ లేదు, 41 మంది ఏకగ్రీవంగా ఎన్నిక.. మంచిదేనా?