Artificial Intelligence: కృత్రిమ మేథ‌.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(AI).. దీని ప్ర‌భావం ప్ర‌పంచంపై బాగానే ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే.. ప్ర‌వేశిస్తున్న ఈ అత్యంత అధునాత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రవేశించింది. రాబోయే కాలమంతా దీనిదే అంటున్నాయి సర్వేసంస్థలు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భార‌త్(India) వంటి వాటిలో రానున్న మూడేళ్ల కాలంలో అంటే 2027 నాటికి భారీగా వృద్ధి చెందుతుంద‌ని నాస్‌కామ్(Naascom) అంచ‌నా వేసింది. సాధార‌ణంగా కృత్రిమ మేథ అంటే.. ఇటీవ‌ల కాలంలోకొంత ఆందోళ‌న‌లు చోటు చేసుకున్నాయి. దీనివ‌ల్ల ఊడిపోతున్న ఉద్యోగాలు స‌హా.. మ‌నిషి క‌న్నా.. 100 రెట్లు ఎక్కువ‌గా ఆలోచ‌న చేస్తుంద‌ని.. ఫ‌లితంగా ఇది చెడుకు దారితీస్తుంద‌ని మేధావులు సైతం చెప్పుకొచ్చారు. అయితే.. ఏ వ్య‌వ‌స్థ‌లో అయినా.. మంచి, చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు కృత్రిమ మేథ‌లోనూ ఈ రెండు ఉన్నాయ‌నే చెబుతున్నారు. 


నాస్‌కామ్ నివేదిక ఏమందంటే..


కృత్రిమ మేధ (AI) ఆధారిత సేవల మార్కెట్ భార‌త్‌(India) ఏటా 25-35% వృద్ధిని సాధిస్తుందని నాస్‌కామ్ త‌న నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 2027 నాటికి ఏఐ మార్కెట్‌(AI market)  దేశీయంగా 17 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.41 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని వివరించింది. టెక్నాలజీకి (Technology) బడ్జెట్‌ (Budget) కేటాయింపులు పెరగడం, మానవ వనరుల లభ్యత, ఏఐ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంద‌ని  విశ్లేషించింది. ‘ఏఐ పవర్డ్‌ టెక్‌ సర్వీసెస్‌’(AI powered Tech Services) పేరుతో ఈ నివేదికను కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన బీసీజీతో కలిసి నాస్‌కామ్‌ ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రంగంలోకి పెట్టుబడులు ఏటా 24% పెరుగుతున్నాయి. 2023లో 83 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.89 లక్షల కోట్ల) పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించింది. ప్రధానంగా డేటా అనలిటిక్స్‌, జెన్‌ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, ఆల్గోరిధమ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ విభాగాల్లోకి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయి.


భార‌త్‌లో.. 


మనదేశంలో ఐటీ కంపెనీలు డిజిటల్‌ కంటెంట్‌(Digital content), డేటా అనలిటిక్స్‌(Data analatics), సప్లై చైన్‌(Supply chain) రంగాలకు నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం ఏఐని వినియోగించడమే కాదు.. తమ సేవల తీరును సరికొత్తగా మారుస్తున్నాయి. మన దేశంలో 4.2 లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారు. ఏటా ఈ నిపుణుల సంఖ్య పెరుగుతోంది. ఈ విష‌యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి-5 దేశాల జాబితాలో మనదేశం ఒకటి. ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నందున, ఏఐ నిపుణుల అవసరాలు పెరుగుతాయని నాస్‌కామ్ వెల్ల‌డించింది. నిపుణుల సంఖ్య ఏటా 15% పెరగాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. దీన్ని పరిగణనలోకి తీసుకునే, ఐటీ కంపెనీలు తమ సిబ్బందిలో ఏఐ నైపుణ్యాలు పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు వచ్చే మూడేళ్లలో బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల)కు పైగా నిధులు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నాయి.


జాగ్ర‌త్త‌లు కీల‌కం..


ఏఐ(AI) పరిజ్ఞానంతో ఐటీ కంపెనీలు తమ వినియోగదార్లకు కొత్త సేవలు ఆవిష్కరించడంతో పాటు అదనపు విలువను జోడించగలుగుతున్నాయని నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌ దేబ్‌జానీ ఘోష్‌ వివరించారు. ఏఐ వినియోగంలో భద్రత, నైతిక విలువలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. లేక‌పోతే.. మంచి క‌న్నా.. చెడుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌నే హెచ్చ‌రిక‌లు కూడా వ‌స్తున్నాయి.