EPFO Payrol Data For December 2023: దేశంలో ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఊరికే వీధుల వెంట తిరగకుండా, ఏదోక ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాలన్న ధోరణి యువతలో ప్రబలంగా కనిపిస్తోంది. భారత్‌లో, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవాళ్ల వివరాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మంగళవారం విడుదల చేసింది. 


ఈపీఎఫ్‌వో పేరోల్‌ డేటా (EPFO Payrol Data) ప్రకారం, 2023 డిసెంబర్ నెలలో నికరంగా 15.62 లక్షల మంది సభ్యులు EPFOలో చేరారు. గత 3 నెలల్లో ఇదే అత్యధికం. దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయని ఈ నంబర్‌ చెబుతోంది. ఏడాది క్రితంతో, 2022 డిసెంబర్ నెలతో పోలిస్తే, ఇది 4.62 శాతం పెరిగింది. నెల క్రితంతో (2023 నవంబర్) పోలిస్తే ఈ సంఖ్య 11.97 శాతం పెరిగింది.


2023 డిసెంబర్‌లో, తొలిసారి ఉద్యోగంలో చేరిన వాళ్ల సంఖ్య 8.41 లక్షలు. వీళ్లు పోను, 15.62 లక్షల్లో మిగిలిన వాళ్లు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి జంప్‌ చేసిన వ్యక్తులు. వీళ్లంతా తమ EPF ఖాతాను రద్దు చేసుకోకుండా ఖాతాను బదిలీ చేసుకున్నారు. తద్వారా, సామాజిక భద్రత కవరేజ్‌లోనే కొనసాగుతున్నారు.


ఉద్యోగార్థుల్లో యువత వాటా సగం కంటే ఎక్కువే                   
పేరోల్ డేటా ప్రకారం, 2023 డిసెంబర్‌లో ఉద్యోగాల్లోకి వచ్చిన కొత్త మెంబర్లలో యువత వాటానే ఎక్కువ. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వారి వాటా 57.18 శాతం. గత మూడు నెలల్లో ఇది అత్యధికం. నవంబర్‌తో పోలిస్తే 14.21% ఎక్కువ. దేశంలోని యువత అసంఘటిత రంగం వైపు కాకుండా క్రమంగా సంఘటిత రంగం వైపు అడుగులేస్తున్నారని ఇది సూచిస్తోంది. 


మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం


ప్రతి నెలా పెరుగుతున్న స్త్రీ శక్తి                    
EPFOలో రిజిస్టర్‌ అవుతున్న మెంబర్ల సంఖ్య ప్రతి నెలా వేగంగా పెరుగుతోంది. మొదటిసారి ఉద్యోగం సంపాదించిన 8.41 లక్షల మందిలో దాదాపు 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. గత మూడు నెలల్లో ఈ సంఖ్య అత్యధికం, 2023 నవంబర్‌తో పోలిస్తే 7.57% వృద్ధి. చేస్తున్న ఉద్యోగం మానేసి, కొత్త ఉద్యోగం ద్వారా మళ్లీ EPFOలో పరిధిలోకి వచ్చిన వాళ్లను కూడా కలుపుకుంటే, 2023 డిసెంబర్‌లో, నికరంగా 2.90 లక్షల నారీ శక్తి పెరిగింది. నవంబర్‌తో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. 


రాష్ట్రాల వారీగా విశ్లేషిస్తే... 5 రాష్ట్రాలు/యూటీల నుంచి నికర సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. అవి... మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హరియాణా. మొత్తం నెట్‌ మెంబర్స్‌లో.. ఈ 5 రాష్ట్రాలు/యూటీల నుంచే దాదాపు 58.33% లేదా 9.11 లక్షల మంది EPFO పరిధిలోని కంపెనీల్లో చేరారు. డిసెంబర్‌ నెలలో 21.63% నికర సభ్యులతో మహారాష్ట్ర ముందంజలో ఉంది.


పరిశ్రమల వారీగా విశ్లేషిస్తే.. ఇనుము & ఉక్కు, భవనాలు & నిర్మాణాలు, సాధారణ బీమా వంటి కంపెనీల్లో చేరుతున్న సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది.


మరో ఆసక్తికర కథనం: జీ ఎంట్‌ పుస్తకాల్లో రూ.2000 కోట్ల మాయ!, అమాంతం జారిపోయిన షేర్లు