Raja Singh: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ(Telangana) బీజేపీ(Bjp)కి కొత్త చిక్కులు ఎదురయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మరోసారి అలకబూనారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రథయాత్ర ప్రారంభోత్సవానికి సైతం ఆయన దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ కమలం వాణిని వినిపించిన ఏకైక ఎమ్మెల్యే అయిన తనకు ఈసారి బీజేపీ ఎల్పీ(BJLP) టీంలో చోటు కల్పించకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.


రాజాసింగ్ అలక 
ఎన్నికల ముందు టిక్కెట్ రాలేదని నేతల అలకలు, బుజ్జగింపులు షరామాములే కానీ..లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ(BJP) ఎమ్మెల్యే అలకపాన్పు ఎక్కడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) బీజేపీ అధిష్టానంపై  అలకబూనారు. తెలంగాణ వ్యాప్తంగా  బీజేపీ చేపట్టిన రథయాత్ర వాహనాలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. అలాగే భువనగిరి బహిరంగ సభకు కూడా హాజరుకాలేదు. బీజేపీ ఎల్పీ(Bjp LP) పదవి దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 


పదవి కోసమేనా..?
గత ప్రభుత్వ హయాంలో బీజేపీ తరపును ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. దీంతో సభలోనూ, బయట ఆయన పార్టీకోసం గళమెత్తారు. దూకుడుగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ 8చోట్ల గెలుపొందింది. పార్టీ సీనియర్ నేతగా, గోషామహల్ నుంచి వరుసగా మూడసార్లు గెలుపొందిన తననే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని రాజాసింగ్ భావించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్(Kishna Reddy) రెడ్డిమాత్రం ఈ వ్యవహారాన్ని  ఇంకా తేల్చకుండా నాన్చడం తో రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అలిగిన ఆయన.. అసెంబ్లీకి హాజరు కాలేదు. ఎల్పీ పదవిని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆశిస్తుండటంతో.. తమ వారికే ఈ పదవి దక్కాలనే పట్టుదలతో ఇద్దరు కీలక నేతలు రాజకీయం నడపడం రాష్ట్ర బీజేపీలో మరోసారి గ్రూప్ రాజకీయాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా.. లెజిస్లేచర్ పదవి కోసం ఓ వైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇంకో వైపు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Maheswara Reddy) పోటీ పడుతున్నారు. రాజాసింగ్ ఇంతకు ముందు పార్టీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఆ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా దీనిపై కన్నేశారు. మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, గతంలో ఒకసారి ఆ పదవిని చేపట్టిన అనుభవం ఉంది. ఇక మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికైన వారే. దీంతో ఈ పదవి కోసం ఇటు రాజాసింగ్, అటు మహేశ్వర్ రెడ్డి మధ్య పోటీ కొనసాగుతోంది.


రాజాసింగ్ కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sunjay) రంగంలోకి దిగారు. ఆయనకు ఎల్పీ పదవి ఇవ్వాల్సిందేనని సంజయ్ హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీన్ని గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బండి సంజయ్ ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ పదవి ఇవ్వాలని కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వం ముందు తన ప్రతిపాదనలు పెట్టారు. దీంతో ఇప్పుడు ఎల్పీ పదవి ఇటు కిషన్ రెడ్డికి అటు సంజయ్​కి ఛాలెంజ్​గా మారింది. ఈ ఇద్దరు కీలక నేతలు ఎవరికి వారే తన వారికే ఎల్పీ పదవి ఇప్పించుకొని రాష్ట్ర బీజేపీలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.


రాజాసింగ్ కు ఎల్పీ పదవిస్తే సిటీలో తన ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి.. మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపారనే ప్రచారం రాష్ట్ర పార్టీలో సాగుతోంది. కిషన్ రెడ్డికి సిటీలో చెక్ పెట్టేందుకు బండి సంజయ్ రాజాసింగ్ వైపు మొగ్గు చూపారనే చర్చ కమల దళంలో నడుస్తోంది. అయితే రాజాసింగ్​కు తెలుగు భాషపై అంతగా పట్టు లేదని, హిందూత్వం తప్ప ఇతర సబ్జెక్టులపై ఆయనకు సరైన అవగాహన లేదనేది కిషన్ రెడ్డి వర్గం వాదన. అయితే సిటీలో ఇప్పుడు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే దానికి  రాజాసింగే కీలకమని, హిందూత్వం వల్లే పాత బస్తీలో మజ్లిస్​ను సవాల్ చేస్తున్నామనేది బండి సంజయ్ వర్గం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచే బీజేపీ ఏకంగా 4 సీట్లు గెలుచుకుందని, అందుకే అదే జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ పదవి ఇవ్వాలనేది కిషన్ రెడ్డి వర్గం వాదిస్తోంది. కిషన్ రెడ్డి శిష్యుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన రాజాసింగ్ కు ఇప్పుడు గురువే గుదిబండగా మారడంతో ఆయన అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది.