Big Blow to Zee Entertainment: సోనీ గ్రూప్‌తో మెర్జర్‌ ఒప్పందం రద్దయిన నెలలోపే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. తాజాగా, మీడియా రంగ దిగ్గజానికి ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో, ఈ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి, షేర్లను వదలించుకోవడానికి ఇన్వెస్టర్లు పోటీలు పడ్డారు. 


ఈ రోజు (బుధవారం, 21 ఫిబ్రవరి 2024) మధ్యాహ్నం 12.00 గంటల సమయానికి, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ధర రూ.20.40 లేదా 10.59% జారిపోయి, రూ.172.25 దగ్గర ట్రేడవుతోంది.


ఊహించిన కంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు మళ్లింపు!?
తొలి ఎదురుదెబ్బ, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) వైపు నుంచి తగిలింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) ఖాతాల్లో భారీ లూప్‌హోల్స్‌ను సెబీ కనిపెట్టినట్లు మార్కెట్‌లో చెప్పుకుంటున్నారు. జీ ఫౌండర్ల విషయంలో జరిపిన దర్యాప్తులో భాగంగా, కంపెనీ నుంచి దాదాపు రూ.2,000 కోట్లు (241 మిలియన్‌ డాలర్లు) మళ్లించినట్లు సెబీ గుర్తించిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ రిపోర్ట్‌ చేసింది. సెబీ ఇన్వెస్టిగేటర్లు మొదట అంచనా వేసిన దాని కంటే మొత్తం కంటే ఇది దాదాపు పది రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది.


అయితే, ఇది ఫైనల్‌ నంబర్‌ కాదని, జీ ఎగ్జిక్యూటివ్స్‌ నుంచి వచ్చిన రిపోర్ట్స్‌ను సమీక్షించిన తర్వాత సెబీ ఒక అంచనాకు వస్తుందని సమాచారం. డబ్బు లెక్కల వివరాలన్నీ పట్టుకుని, వచ్చి తమకు కలవమని జీ ఫౌండర్లు సుభాష్ చంద్ర ‍‌(Subhash Chandra), అతని కుమారుడు పునిత్ గోయెంకా (Punit Goenka), కొంతమంది బోర్డు సభ్యులు, సీనియర్ అధికార్లను సెబీ ఆదేశించినట్లు తెలుస్తోంది. 


ఈ విషయంపై సెబీ గానీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. 


సోనీ నుంచి రెండో ఎదురుదెబ్బ
నెల క్రితం రద్దయిన ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి, తిరిగి చేతులు కలపడానికి సోనీ గ్రూప్‌-జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రయత్నిస్తున్నాయంటూ నిన్న, మొన్న ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఆ న్యూస్‌తో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడ్‌లో ఎగబాకాయి. అయితే.. ఆ వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని స్పష్టం చేస్తూ, సోనీ గ్రూప్‌ ఒక ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసింది. ఈ రోజు జీల్‌ షేర్ల పతనానికి ఇది కూడా ఒక కారణం.


సోనీతో 10 బిలియన్‌ డాలర్ల విలీన ప్రణాళిక కుప్పకూలిన తర్వాత, పెట్టుబడిదార్లకు భరోసా ఇవ్వడానికి జీల్‌ ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో తగిలిన ఈ రెండు ఎదురుదెబ్బలు గోయెంకా తలనొప్పులను ఇంకా పెంచుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం