Indomethacin Drug:  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్‌ సైంటిస్టులు రూపొందించిన ఔషధం కోవిడ్ ట్రయల్స్ లో సత్ఫలితాలు చూపించింది. స్వల్ప కోవిడ్ క్షణాలు ఉన్న రోగుల్లో యాంటీవైరల్ ఏజెంట్‌గా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ ఇండోమెథాసిన్ ప్రభావం చూపించింది. ఈ అధ్యయనం ఫలితాలు ఇటీవల ప్రతిష్టాత్మక పీర్-రివ్యూడ్ జర్నల్‌ నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించారు. 


పనిమలార్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన అధ్యయనానికి ఐఐటీ మద్రాస్‌లో అనుబంధ ఫ్యాకల్టీ, MIOT హాస్పిటల్స్‌లో నెఫ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ రాజన్ రవిచంద్రన్ నాయకత్వం వహించారు. ఈ అధ్యయనాన్ని ఐఐటీ మద్రాస్‌లోని ప్రొఫెసర్ ఆర్ కృష్ణ కుమార్ కోఆర్డినేట్ చేశారు. "ఇండోమెథాసిన్ ఒక్క USలోనే సంవత్సరానికి 20 లక్షల కంటే ఎక్కువ ప్రిస్క్రిప్షన్‌లతో, వివిధ రకాల ఇన్ఫ్లమేషన్ సంబంధిత చికిత్సకు విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషధం" అని IIT మద్రాస్ ఒక ప్రకటనలో తెలిపింది.


ఇటాలియన్, యూఎస్ శాస్త్రవేత్తలు శాస్త్రీయ ప్రాతిపదికన పరిశోధించినప్పటికీ, క్లినికల్ ట్రయల్ ద్వారా ఇండోమెథాసిన్ సామర్థ్యాన్ని మొదటిసారి పరిశోధించి భారతీయ పరిశోధకులు అని ఐఐటి మద్రాస్ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం అధ్యయనానికి ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ నిధులు సమకూర్చారు.






"COVID ఇన్ఫెక్షన్ ప్రాణాంతక ప్రభావాలలో ఇన్ఫ్లమేటరీ, సైటోకిన్ తుఫాను అని తెలుసుకున్న, మేము నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఇండోమెథాసిన్‌ను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాం. శాస్త్రీయ ఆధారాలు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ-వైరల్ చర్యను బలంగా చూపుతున్నాయి. ఇండోమెథాసిన్ ఒక సురక్షితమైన ఔషధం. నేను గత 30 సంవత్సరాలుగా నా వృత్తిలో దీనిని ఉపయోగిస్తున్నాను" అని డాక్టర్ రాజన్ రవిచంద్రన్ అన్నారు.


పరిశోధన ఫలితాలను హైలైట్ చేస్తూ, IIT మద్రాస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ ఆర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ, "అడ్మిట్ అయిన మొత్తం 210 మంది రోగులలో 107 మందిని నియంత్రణ బృందానికి కేటాయించారు, పారాసెటమాల్ తో ప్రామాణిక చికిత్స చేశారు. 103 మంది రోగులకు ఇండోమెథాసిన్ ఇచ్చారు. దగ్గు, జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, ఆక్సిజన్... ఇలా రోగులను ప్రతిరోజు పర్యవేక్షించారు. ఇండోమెథాసిన్ పొందిన 103 మంది రోగులలో ఎవరూ ఆక్సిజన్ డీసాచురేషన్‌ చెందలేదు. ఇది వాడని 109 మంది రోగులలో 20 మంది ఆక్సిజన్ లెవెల్స్ 93 శాతం కంటే తక్కువగా ఉన్నారు. ఇండోమెథాసిన్ గ్రూపు రోగులు మూడు నుండి నాలుగు రోజుల్లో అన్ని లక్షణాల నుండి కోలుకున్నారు. ఇతర రోగులకు ఇది రెండింతలు సమయం పట్టింది. కాలేయం, మూత్రపిండాల పనితీరు పరీక్షలు ఎటువంటి ప్రతికూల ప్రతిచర్యను చూపించలేదు," అని ఆర్ కృష్ణ కుమార్ తెలిపారు. 


"ఇండొమెథాసిన్ అన్ని వేరియంట్‌లతో పని చేస్తుంది. మేము రెండు ట్రయల్స్ చేసాం, ఒకటి మొదటి వేవ్‌లో, మరొకటి రెండో వేవ్‌లో పరిశోధన చేశాం. ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయి. ICMR ఈ అధ్యయనాన్ని గమనించి, COVID చికిత్స ప్రోటోకాల్‌లో ఇండోమెథాసిన్‌ను అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను." డాక్టర్ రాజన్ రవిచంద్రన్ అన్నారు.