Coins Alimony: భార్యకు భరణంగా రూ. 55 వేలు ఇవ్వాలని కోర్టు ఓ వ్యక్తిని ఆదేశించింది. తన భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అతడు.. రూ. 55 వేల మొత్తాన్ని రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో తీసుకురాగా.. కోర్టు ఇచ్చిన షాక్ తో దిమ్మితిరిగిపోయింది. అతడు తీసుకు వచ్చిన కాయిన్స్ ను తీసుకోవాలని భార్యకు చెబుతూనే.. ఆ నాణేలను వెయ్యి వంతున లెక్కించి వేర్వేరుగా అందివ్వాలని భర్తను ఆదేశించింది. 


కోర్టును ఆశ్రయించిన భార్య, డబ్బు ఇవ్వాలని కోర్టు ఆదేశం


రాజస్థాన్ జైపూర్ లోని హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్, భార్య సీమ కు మధ్య విభేదాలు రావడంతో విడాకులు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో ఆ కేసు పెండింగ్ లో పడిపోయింది. అప్పటి వరకు సీమకు నెలకు రూ. 5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్ కుమావత్ ను కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలను దశరథ్ బేఖాతరు చేశాడు. 11 నెలలుగా డబ్బు ఇవ్వడం లేదు. దీంతో సీమ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దశరథ్ కోర్టు ఆదేశాలను పాటించడం లేదని, తనకు రావాల్సిన సొమ్ము ఇప్పించాల్సిందిగా కోర్టును కోరింది. విచారించిన కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది. అయితే తాను డబ్బు చెల్లించలేనని చెబుతూ సీమకు డబ్బు చెల్లించేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు అతడిని జూన్ 17 వ తేదీన అరెస్టు చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్ ను అదనపు జిల్లా జడ్జి ముందు హాజరు పరిచారు.


Also Read: Shocking News: షాకింగ్ - కస్టమర్ చెవి పోయేలా చేసిన బ్యూటీ పార్లర్, ఓనర్ పై కేసు పెట్టిన పోలీసులు


రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే షాకిచ్చిన కోర్టు


అయితే.. దశరథ్ అరెస్టు కావడంతో డబ్బు తీసుకురావాల్సిందిగా దశరథ్ తన కుటుంబసభ్యులకు చెప్పాడు. అన్నీ రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో రూ.55 వేలు తీసుకురావాలని చెప్పడంతో వాళ్లు కూడా అలాగే ఏడు బస్తాల్లో కాయిన్స్ ను కోర్టుకు తీసుకువచ్చారు. ఈ 7 బస్తాల బరువు సుమారు 280 కిలోలు ఉంది. రూ. 55 రూపాయల విలువైన ఆ రూపాయి, రెండు రూపాయల నాణేలను తీసుకునేందుకు సీమ నిరాకరించింది. తనను ఇబ్బంది పెట్టేందుకు ఇలా మొత్తం కాయిన్స్ రూపంలో తీసుకు వచ్చాడని కోర్టు ముందు వాపోయింది. ఏడు బస్తాల్లో ఉన్న రూపాయి, రెండు రూపాయిల నాణేలను లెక్కించడానికి 10 రోజులు పడుతుందని ఇది పరోక్షంగా వేధించడం కిందకే వస్తుందని సీమ తరఫు న్యాయవాధి కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.


కోర్టు మాత్రం దశరథ్ అలా కాయిన్స్ రూపంలో చెల్లించడాన్ని అనుమతిస్తూనే.. షాకింగ్ ఆదేశం ఇచ్చింది. అదేంటంటే.. ఆ నాణేలను వెయ్యి చొప్పున లెక్కించాలని అది కూడా దశరథ్ స్వయంగా లెక్కించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 26కు కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు డబ్బు కోర్టు ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్ లెక్కించి రూ. వెయ్యి చొప్పున ప్యాకెట్లుగా విభజించి, కోర్టులోనే సీమకు అప్పగించాలని తేల్చి చెప్పింది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial