ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన రెండో రోజు కొనసాగుతూ ఉంది. నేడు (జూన్ 21) ఆయన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. న్యూయార్స్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఈ యోగా వేడుకలు జరగడం విశేషం. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన మోదీ యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం యోగా గొప్పదనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.


‘‘యోగా అంటే ఏకత్వం. ఇక్కడ ప్రతి దేశ జాతీయత ప్రతిబింబిస్తోంది. యోగా అనేది భారత దేశ పురాతన సాంప్రదాయం. దీనికి కాపీరైట్లు, పేటెంట్లు, రాయల్టీ పేమెంట్లు ఏమీ ఉండవు. ఫిట్‌నెస్ పరంగా ఏ వయసుకైనా, ఎవరికైనా యోగా ఎంతో మేలు చేస్తుంది. యోగా అనేది ఒక పవర్. ఈ పవర్ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికే కాకుండా ఎదుటివారితో వినమ్రతగా ఉండేలా చేస్తుంది. మీలో చాలా మంది ఇక్కడికి చాలా దూరం వచ్చారు. ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. యోగా భారతదేశం నుండి వచ్చింది. ఇదొక ప్రాచీన సంప్రదాయం. ఇలా మీ అందరినీ చూస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.


మిల్లెట్ ఇయర్ కు ప్రపంచమంతా మద్దతు - మోదీ


2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా పాటించాలన్న భారత్ ప్రతిపాదనకు గత ఏడాది ప్రపంచం మొత్తం కలిసి మద్దతు పలికింది. మిల్లెట్ ఒక సూపర్ ఫుడ్. అవి మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు పర్యావరణానికి కూడా మంచివి. ప్రపంచం మొత్తం మరోసారి యోగా కోసం తరలిరావడం అద్భుతం. యోగా శక్తిని సద్వినియోగం చేసుకుందాం. స్నేహం, శాంతియుత ప్రపంచం, స్వచ్ఛమైన, గ్రీన్, సస్టెనబుల్ భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడానికి యోగా శక్తిని ఉపయోగించుకుందాం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి అందరం చేతులు కలుపుదాం.’’ అని మోదీ పిలుపు ఇచ్చారు.


నేను యోగాకి అభిమానిని - కసాబా కొరోసోయ్


ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు కసాబా కొరోసోయ్ మాట్లాడుతూ.. యోగా అనేది మన శారీరక సామర్థ్యాన్ని పెంచుతుందని అన్నారు. దీనితో పాటు మన మానసిక, మేథో సామర్థ్యం కూడా పెరుగుతుందని అన్నారు. తాను కూడా యోగాకు పెద్ద అభిమానిని అని చెప్పాడు. మన ప్రపంచానికి సంతులనం స్వీయ నియంత్రణ అవసరం అని అన్నారు. భారత రాయబారి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం చాలా ప్రత్యేకమైనదని అభివర్ణించారు.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు దేశాల ప్రజలు కలిసి యోగా చేస్తూ రికార్డు సృష్టించినట్లయింది. 9వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఒక బ్యాగ్రౌండ్ బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఫ్రీడం ప్లాజాలో జరిగే ఓ కల్చరల్ ఈవెంట్ కు హాజరవుతారు. ఆ కార్యక్రమం నుంచి నేరుగా వర్జినీయాకు వెళ్తారు.