Pakistan Bans Holi: 


ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయం..


పాకిస్థాన్‌ ఉన్నత విద్యా కమిషన్ (HEC) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో హోళి వేడుకలు చేసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మధ్యే జూన్ 12వ తేదీన Quaid-i-Azam యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున హోళి వేడుకలు చేసుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన విద్యా కమిషన్...ఇంకెప్పుడూ ఈ పండుగ జరపడానికి అవకాశం లేకుండా బ్యాన్ విధించింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని స్పష్టం చేసింది. 


"విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలు ఉండడం సమాజానికి అవసరమే. కానీ...అవి హద్దులు మించకుండా ఉంటేనే మంచిది. విద్యార్థులెవరైనా సరే కచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సొంత అభిప్రాయాలను, ఇష్టాలని కావాలని రుద్దడం మానేయాలి. అందరి అభిప్రాయాలనూ గౌరవించాలి. ఈ ఈవెంట్ కారణంగా దేశానికే మచ్చ వచ్చేలా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశ గౌరవాలకు, సామాజిక విలువలకు భంగం వాటిల్లే పనులు విద్యార్థులు చేయకూడదు."


- యూనివర్సిటీ నోటీస్‌






వీడియోలు వైరల్..


ఇస్లామాబాద్‌లోని క్వాయిద్ ఇ అజామ్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున హోళీ వేడుకలు జరుపుకున్నారు. క్యాంపస్‌లోనే రంగులు జల్లుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. మెహరన్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఈ వేడుకలు నిర్వహించింది. అయితే...ఓ ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు వీటిని అడ్డుకున్నారు. అంతకు ముందు పంజాబ్ యూనివర్సిటీలోనూ ఇలానే వేడుకలు చేసుకోగా...ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరిపై దాడి చేశారు. ఈ గొడవల్లో దాదాపు 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు. ఇవి మరీ ముదరక ముందే మేల్కోవడం మంచిదని భావించిన హైయర్ కమిషన్..హోళి వేడుకలపై నిషేధం విధించింది.