Gurugram: గురుగ్రామ్ లోని ఓ బ్యూటీ పార్లర్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టరమ్ చెవిని డ్యామేజ్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డట్లు ఫిర్యాదు అందడంతో కేసు పెట్టారు. పూజా అనే మహిళ గురుగ్రామ్  సెక్టార్ 7 లోని న్యూ కాలనీ మోర్ లో ఉన్న జ్యోతి నరులాకు చెందిన బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. అక్కడ చెవులు కుట్టించుకుంది. అది సరిగ్గా లేకపోవడంతో మరోసారి చేయాల్సి వచ్చింది. అలా మూడు నెలల పాటు జరిగిన శస్త్రచికిత్స లాంటి పద్ధతి కాస్త పూర్తిగా వికటించింది. దీంతో పూజ చెవికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. పూజ కుడి చెవి కింద భాగం మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితి మరింత దిగజారకముందే వైద్యుడిని సంప్రదించి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చికిత్స తీసుకుంది. తర్వాత సదరు బ్యూటీ పార్లర్ కు వెళ్లిన పూజా.. పార్లర్ ఓనర్ అయిన జ్యోతితో గొడవకు దిగింది. దీంతో తనకు జరిగిన నష్టానికి రూ.1.5 లక్షలు ఇస్తానని ఒప్పుకుంది జ్యోతి. అయితే తర్వాత ఇస్తానని హామీ ఇచ్చిన డబ్బు ఇవ్వకపోగా.. జ్యోతి తిరిగి బెదిరింపులకు దిగినట్లు పూజా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా వాళ్లు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది పూజా. తర్వాత 2022 జూన్ లో ముఖ్యమంత్రి గ్రీవెన్స్ కమిటీకి పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. 


ఈ ఏడాది మే 29వ తేదీన పూజ కోర్టును ఆశ్రయించింది. తన సమస్యను వివరిస్తూ పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చింది. దీంతో సదరు బ్యూటీ పార్లర్ యజమానిపై కేసు నమోదు చేయాలని జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ యాదవ్ పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల్లో కదలిక వచ్చింది. సదరు బ్యూటీ పార్లర్ యజమాని జ్యోతి నరులా పై న్యూకాలనీ పోలీస్ స్టేషన్ లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 338 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని, విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 


Also Read: International Baccalaureate: జగన్ చెప్పిన ఐబీ సిలబస్‌ ఏంటీ? పరీక్షలే లేని చదువులు ఎలా సాధ్యం? పోటీ ప్రపంచంలో రాణిస్తారా?


చెవులు కుట్టించుకోవడం ఓ ఫ్యాషన్


చెవులు, ముక్కు కుట్టించుకోవడం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా కాలం నుంచి ఉన్న సాంప్రదాయం. అయితే కొన్నేళ్లుగా ఈ చెవులు కుట్టించుకోవడంలో కొత్త ధోరణి మొదలైంది. చిన్న చిన్న పూసలు, ముత్యాలు, ఇతర ఆకారాల్లో ఉండే వాటిని ఫ్యాషన్ కోసం కేవలం చెవులే కాకుండా శరీరంలోని వివిధ భాగాల్లో కుట్టించుకుంటున్నారు. కనుబొమ్మలు, పెదవులు, నాభి, ముక్కు, నాలుక, ప్రైవేట్ పార్ట్స్ కు కూడా చిన్న చిన్న పూసలతో కుట్టించుకుంటున్నారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. నిపుణులు, అనుభవం ఉన్న వారు చేస్తే పెద్దగా ప్రమాదం కూడా ఉండదు. అయితే కొందరిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. చీము పట్టడం, అలెర్జీ రావడం, కెలాయిడ్ మచ్చలు, చర్మం చిరిగిపోవడం లాంటి రిస్క్ లు కూడా ఉంటాయి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial