Howara-CSMT Express: జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌లో మంగళవారం (జులై 30) తెల్లవారుజామున రైలు ప్రమాదానికి గురైంది. 12810 నెంబర్ గల హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ చక్రధర్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. లోకోమోటివ్ నెంబర్ 37077 వద్ద ప్రమాదం జరిగింది.
రాజ్ ఖర్స్‌వాన్ వెస్ట్ ఔటర్, బారాబాంబు స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 4.00 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం గురించిన తెలిసిన వెంటనే రైల్వే వైద్య బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆన్-సైట్ సిబ్బందితో కూడిన ARME, ADRM CKP అక్కడకు చేరుకున్నాయి. క్షతగాత్రులందరికీ భారతీయ రైల్వే వైద్య బృందం ప్రథమ చికిత్స అందించింది.
హౌరా-ముంబై మెయిల్ ఎక్స్ ప్రెస్‌కు చెందిన సుమారు 5 బోగీలు పట్టాలు తప్పి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. ఆరుగురికిపైగా ప్రయాణికులు గాయపడ్డారని వారిని చక్రధర్ రైల్వే ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు రైల్వే స్వయంగా ధృవీకరించింది.
ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. జార్ఖండ్‌లోని చక్రధర్ పూర్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ ఉందని ఫోటోలో చూస్తుంటే అర్థమవుతోంది. ప్రమాదానికి కారణం ఏంటనే విషయంపై ఇకా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన సమయంలో పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలు నిలబడి ఉంది. పట్టాలు తప్పిన బోగీలు ఆ గూడ్స్ రైలును ఢీకొన్నాయి.
ఎయిర్ అంబులెన్స్‌ను పంపిన అధికారులు
ఎయిర్ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ తీవ్రంగా గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నా... ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది.