PM Surya Ghar Muft Bijli Yojana: 78 వేలు ఖర్చు పెడితే చాలా మీ ఇంటికి ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. ఇంకా ఖర్చు పెడితే మీరే ప్రభుత్వానికి విద్యుత్ తిరిగి విక్రయించవచ్చు. అవును నిజమే పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా అది సాధ్యమవుతుంది. ఇంటి పైకప్పునే ఆదాయ వనరుగా మార్చుకొని ఇవన్నీ చేయవచ్చు.
కేంద్రం ఇస్తున్న పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా మీరు ఇంటిపై సోలార్ ప్యానెల్ ఫిట్ చేసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చులో సగం కేంద్రమే భరిస్తుంది. మిగతా ఖర్చును బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకోవచ్చు. 2023-24 నుంచి 2026-27 వరకు ఈ పథకం అమలు ఓుంటుంది. దాదాపు రూ.75,021 కోట్లు దీనిపై కేంద్రం ఖర్చు పెట్టనుంది. ఈ పథకం కింద రాయితీని రెండు భాగాలుగా ఇస్తారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉన్న సోలార్ ప్యానల్స్‌కు 60శాతం రాయితీ ఇస్తారు. అంతకు మించిన యూనిట్లకు 40 శాతం రాయితీ ఇస్తారు.
మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే మీకు లక్షా 45 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో 60 శాతం అంటే దాదాపు 78 వేల రూపాయలను కేంద్రం భరిస్తుంది. మిగతా 67 వేల రూపాయలను బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి గ్యారంటీలు పెట్టాల్సిన పని లేదు. దీనికి వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటుంది. 1 కిలోవాట్‌కు రూ.30వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల ప్లాంట్ కు రూ.78వేలు రాయితీ వస్తుంది.
అమ్ముకుంటే వెయ్యికిపైగా ఆదాయం
ఇంత ఖర్చు పెట్టిన సోలార్ ప్యానెల్‌తో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇంటి అవసరాల కోసమే కాకుండా ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. మీరు ఉత్పత్తి చేసే 300 యూనిట్ల వరకు ఇంటి అవసరాల కోసం వాడుకోవచ్చు. తర్వాత ఉత్తత్తి అయ్యే విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. ఇలా అమ్ముకోవడం ద్వారా నెలకు దాదాపు వెయ్యి రూపాయలకుపైగానే ఆదాయం వస్తుంది. ఇందులో ప్లాంట్ ఏర్పాటు కోసం తీసుకున్న బ్యాంకు లోనుకు కొంత పోయినా మిగతాది అదనపు ఆదాయంగానే చూడొచ్చు. ఇలా సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో ఇంట్లో విద్యుత్ ఉచితంగా పొందడమే కాకుండా ఆదాయం పొందవచ్చు. తీసుకన్న బ్యాంకు రుణం కూడా ఏడేళ్లలో తీర్చుకోవచ్చు.
ఎవరికి ఎంత కెపాసిటీ అవసరం
సూర్యఘర్ వెబ్‌సైట్‌లో చెప్పినట్టు నెలకు 0-150 యూనిట్ల విద్యుత్ వినియోగించే 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ ప్యానెల్ సరిపోతుంది. 150-300 యూనిట్లు వాడుకునే వాళ్లకు 3 కిలోవాట్ల సామర్థ్యం పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 కిలోవాట్లకు మించి సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే గరిష్ఠంగా రూ.78వేలు వరకు మాత్రమే రాయితీ వస్తుంది. అంతకు మించి ఇవ్వరు.
ఇలా ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే వీలు లేని వాళ్లు గ్రూప్‌గా ఏర్పడి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. 500 కిలోవాట్ల వరకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కిలోవాట్‌కు రూ.18 వేల వరకు రాయితీ ఇస్తారు.
ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్
- pmsuryaghar.gov.in పోర్టల్‌లోకి వెళ్లిన తర్వాత సైనప్ అడుగుతుంది. దీని కోసం పేరు, రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీ పెంచు నమోదు చేయాలి. మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ కూడా జత చేయాలి.
- కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం అప్లయ్ అనే దానిపై క్లిక్ చేయాలి.
- అక్కడ పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత మీ విద్యుత్ డిస్కమ్ ఓకే చెప్పే వరకు ఎదురు చూడాలి. వాళ్లు అనుమతి ఇచ్చిన తర్వాత సూచించిన సోలార్ ప్యానెల్ అమ్మే సంస్థ నుంచి సోలార్ ప్లాంట్ కొనుగోలు చేస్తే వాళ్లే ఇన్‌స్టాల్ చేస్తారు.
- ఇన్‌స్టలేషన్ పూర్తైన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో పొందుపరచాలి. అనంతరం నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ వచ్చిన తర్వాత ఇన్‌స్టాల్ చేస్తారు. డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
- ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీ బ్యాంకు అకౌంట్ వివరాలతో ఒక క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇది చేసిన 30 రోజుల్లోపు మీరు ఖర్చుపెట్టిన దాంట్లో కేంద్రం ఇచ్చే రాయితీ మీ ఖాతాలో పడుతుంది.