Delhi Police Arrested A Man Posing As US Model And Cheated 700 Women: పగలంతా ఆఫీసులో బుద్ధిమంతుడిలా నటిస్తూ పని చేస్తాడు. రాత్రయితే చాలు అమెరికా మోడల్ (America Model) అవతారమెత్తుతాడు. ఈ ముసుగులోనే అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. వారితో సాన్నిహిత్యంగా ఉంటూ వ్యక్తిగత విషయాలు తెలుసుకుని.. ఆ తర్వాత వాటితోనే వారిని బెదిరిస్తాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అమ్మాయిలను ఓ ప్రబుద్ధుడు మోసం చేశాడు. చివరకు అతని పాపం పండి నేరం బయటపడి కటకటాలపాలయ్యాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుషార్ సింగ్ బిష్ట్ (23) (Tushar Singh Bist) అనే వ్యక్తి గత మూడేళ్లుగా నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్‌గా పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నా అత్యాశకు పోయి సైబర్ నేరాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఓ యాప్ నుంచి వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్ కొనుగోలు చేసి డేటింగ్ యాప్ బంబుల్, సోషల్ మీడియా ప్లాట్ ఫాం స్నాప్‌చాట్‌లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫోటోలు, స్టోరీలను తీసుకుని తన ప్రొఫైల్‌లో పోస్ట్ చేసేవాడు. అమెరికాలో తాను ఫ్రీలాన్స్ మోడల్‌లా పని చేస్తున్నానని.. త్వరలోనే భారత్ వస్తున్నానని నమ్మించి చాలామంది యువతులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారితో స్నేహం చేసి ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించాడు. కొద్దిరోజులకు ఆ వీడియోలతోనే వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు.


పాపం పండిందిలా..


గతేడాది డిసెంబరులో ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న ఓ యువతి తుషార్‌పై ఫిర్యాదు చేయడంతో అతని మోసాల చిట్టా బయటపడింది. 2024 జనవరిలో బంబుల్‌లో అతనితో పరిచయం అయినట్లు బాధిత యువతి తెలిపింది. ప్రేమ పేరుతో ప్రైవేట్ వీడియోలు తీసుకుని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. వాటిని డార్క్‌వెబ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు దాదాపు 700 మంది అమ్మాయిలను వలలో వేసుకున్నట్లు గుర్తించారు. బంబుల్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది యువతులతో స్నేహం చేసి వారి నుంచి డబ్బులు గుంజినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.


Also Read: World hair Transplant Capital Turkey: గుండుపై జుట్టు మెలిపించుకోవాలా - చలో టర్కీ - ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్యాపిటల్‌ అదే !