Bengaluru Opposition Meeting


గేమ్‌ని డిసైడ్ చేసే భేటీ..


2014లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయింది. క్రమంగా  బీజేపీ క్యాడర్ పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా  పుణ్యమా ఆ పార్టీకి ఎక్కడిలేని బూస్టప్ వచ్చింది. ఆయనే స్టార్ క్యాంపెయినర్‌ అయ్యారు. బీజేపీ అంటే నరేంద్ర మోదీయే అనే స్థాయిలో తన మార్క్ చూపించారు మోదీ. అటు మోదీకి ఆదరణ పెరుగుతూ వస్తుంటే...దాదాపు 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ డీలా పడుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొంత వరకూ ప్రభావం చూపించింది. కర్ణాటకలో ఆ పార్టీ సాధించిన విజయమే ఇందుకు ఉదాహరణ. అవి అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పుడు రాబోయేవి లోక్‌సభ ఎన్నికలు. అంటే...ఢిల్లీలో ఏ పార్టీ గద్దెనెక్కుతుందో డిసైడ్ చేసే ఎలక్షన్స్ ఇవి. అందులోనూ వరుసగా రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోష్‌తో ఉంది బీజేపీ. ఆ పార్టీని ఒంటరిగా కాంగ్రెస్ ఢీకొట్టే పరిస్థితైతే లేదు. ఇప్పుడా పార్టీకి కావాల్సింది బలం, బలగం. ఆ బలాన్ని సమకూర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. అందులో భాగంగానే విపక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బలగాన్ని పెంచుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బెంగళూరు వేదికగా జరుగుతున్న భేటీ కూడా ఇందులో భాగమే. ఈ సమావేశానికి 26 పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారని కాంగ్రెస్ స్వయంగా ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశాన్ని లీడ్ చేయనున్నారు.  ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే...విపక్షాలను తామే లీడ్ చేస్తున్నామని కాంగ్రెస్ పరోక్షంగా ప్రచారం చేసుకుంటోంది. 


కాంగ్రెస్ కౌంటర్ అటాక్..


ఈ సమావేశానికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పట్నాలో ఓ సారి విపక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశం తరవాత NDAలో భయం మొదలైందని అన్నారు జైరాం. "మేమంతా ఒక్కటవడం బీజేపీని తెగ ఇబ్బంది పెడుతోంది. అందుకే వాళ్లు కూడా బల సమీకరణపై దృష్టి పెట్టారు" అని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఇప్పుడిదే మాట చెబుతున్నారు. పైగా UPA పేరు కూడా మారిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. బహుశా...బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చే పేరు ఏదైనా ఖరారు చేస్తారేమో తెలియాల్సి ఉంది. దీనిపై కాంగ్రెస్‌ని ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. వాళ్లు చెబుతున్న మాట ఒక్కటే. 
"దేశ రాజకీయాల్లో బెంగళూరు భేటీ గేమ్‌ ఛేంజర్ అవుతుంది. గమనిస్తూ ఉండండి" అని. ఇకపై ఏ విషయంలోనైనా సరే...కలిసికట్టుగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే విభేదాలను మర్చిపోయి పార్టీలు ఒక్కటవుతున్నాయి. జాతీయ హోదా పొందిన ఆప్‌, కాంగ్రెస్‌తో మైత్రికి సిద్ధమైంది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ఇలా పలు పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసిపోవడం కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్ పెంచుతోంది. 


స్టైల్ మార్చిన కాంగ్రెస్..


అయితే...ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే "వారసత్వ రాజకీయాలు" అనే ముద్రని బీజేపీ ఇప్పటికే విపక్షాలపై వేసేసింది. "మేం దేశం కోసం ఆలోచిస్తే..వాళ్లు కుటుంబం కోసం ఆలోచిస్తారు" అని ప్రచారం చేస్తోంది. ఇది విపక్షాలకు గట్టి దెబ్బే. అలా అని పూర్తిస్థాయిలో ఇది ప్రభావం చూపుతుందని చెప్పలేం. కాంగ్రెస్ గతంలోలా లేదు. బీజేపీ వేసే ప్రతి కౌంటర్‌ని ఎన్‌కౌంటర్ చేస్తోంది. సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ స్టైల్‌ కూడా మార్చింది. ఆర్నెల్లలో ఆ పార్టీలో ఎంతో కొంత మార్పు కనిపిస్తోంది. అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో పదేపదే ప్రస్తావించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఈ విషయంలో చాలా గట్టిగానే నిలబడింది. ఆ తరవాత రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్నీ విపక్షాలను ఒక్కటి చేసేందుకు ఉపయోగించుకుంది. ఇందులో కొంత వరకూ కాంగ్రెస్ సక్సెస్ అయినట్టే. కానీ...ప్రస్తుతం బీజేపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంత సులువుగా ఆ పార్టీని పక్కన పెట్టి ప్రజలంతా కలిసి గద్దె దించే పరిస్థితులైతే లేవు. బహుశా విపక్షాల ప్రచారంతో కొంత వరకూ సీట్లు కోల్పోయినా అధికారంలోకి రాకపోవడానికి పెద్ద కారణాలైతే కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీకి విదేశాల్లోనూ క్రేజ్ ఉండడం....ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు కావాల్సింది బీజేపీ విధానాలపై డైరెక్ట్ అటాక్ చేసే బలమైన కూటమి. కాంగ్రెస్‌ ఆ ప్రయత్నాలు మొదలు పెట్టినా...చివరి వరకూ ఆ బలం అలాగే ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. 


Also Read: Joint Oppn Meet: బెంగళూరులో విపక్షాల కీలక భేటీ, ఈసారి వ్యూహాలు ఫైనల్ అయిపోతాయా?