UPA’s New Name: 


యూపీఏ పేరు మార్పు..? 


బీజేపీతో పోరాటం చేసేందుకు ఈ సారి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. మూడోసారి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అందుకే...విభేదాలు పక్కన పెట్టి మరీ కలిసిపోతున్నాయి. వ్యూహాలనూ మార్చుకుంటున్నాయి. కేవలం వ్యూహాలనే కాదు. ఈ సారి తమ కూటమి పేరే మార్చుకునేందుకు సిద్ధవుతున్నట్టు తెలుస్తోంది. యాంటీ బీజేపీ పార్టీలన్నీ కలిసి United Progressive Alliance (UPA) కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో కాంగ్రెస్ సహా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ఉన్నాయి. చాలా రోజులుగా ఇదే పేరు కంటిన్యూ అవుతోంది. ఈసారి పేరు మార్చేసి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నాయి విపక్షాలు. బెంగళూరులో జరుగుతున్న రెండ్రోజుల భేటీలో UPA కొత్త పేరుని ఖరారు చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే భేటీలో రాష్ట్రాల వారీగా సీట్‌ షేరింగ్‌ విషయంలోనూ క్లారిటీకి రానున్నాయి పార్టీలు. రాష్ట్రాల వారీగా కమ్యూనికేషన్ పాయింట్‌ల ఏర్పాటుకు ఓ సబ్‌ కమిటీని నియమించనున్నట్టు తెలుస్తోంది. క్యాంపెయినింగ్ ఎలా చేయాలి..?  ర్యాలీలు ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలి..? ఆందోళనలు ఎక్కడ చేపట్టాలి..? ఇలా అన్ని వ్యూహాలనూ ఈ కమిటీయే నిర్ణయిస్తుంది. మరో కీలక విషయం ఏంటంటే...ఈ సారి ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. EVMల ప్రస్తావన తీసుకొచ్చి దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.   


నడ్డా విమర్శలు..


ఈ విపక్షాల భేటీపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండి పడ్డారు. కేవలం తమ వారసత్వ రాజకీయాలను కాపాడుకోవడం కోసం ఈ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని UPA కూటమి ఎప్పుడూ పక్షపాతం, వేధింపులకే మద్దతుగా ఉంటుందని విమర్శించారు. ప్రజాస్వామ్య కూటమి అని ఆ పార్టీలు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో "నహీ సహేగా రాజస్థాన్" పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని గద్దె దించాలని గట్టి సంకల్పంతో ఉంది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ ఓ తల్లి, కొడుకు, కూతురుకి మాత్రమే చెందిన పార్టీ అని విమర్శించారు నడ్డా. 


26 పార్టీల నేతలు..? 


జూన్ 23న పట్నాలో జరిగిన భేటీకి దాదాపు 15 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సారి బెంగళూరు భేటీకి దాదాపు 26 పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరవుతున్నట్టు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అందరికీ స్వాగతం పలికి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అప్పటి నుంచి చర్చలు మొదలవుతాయి. ఆ తరవాత రేపు (జులై 18) మరో రౌండ్ చర్చలు జరుగుతాయి. బీజేపీని ఎదుర్కోడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో ఈ సమావేశంలో ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ సమావేశాలకు హాజరవుతారు. 


Also Read: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం, బ్యాటరీ బాక్స్‌లో ఉన్నట్టుండి మంటలు