Vande Bharat Express: 


భోపాల్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన..


భోపాల్ ఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాటరీ బాక్స్‌లో మంటలు రావడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. ఇవాళ ఉదయం (జులై 17) 8 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని కుర్వాయ్ కెతోరా స్టేషన్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. భోపాల్‌లో ఉదయం 5.40 నిముషాలకు ప్రారంభమైంది వందేభారత్ ట్రైన్. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కి మధ్యాహ్నం 1.10నిముషాలకు చేరుకుంటుంది. అయితే...మధ్యలో అగ్నిప్రమాదం జరగడం వల్ల అంతరాయం కలిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీల్స్ వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఫైర్ బ్రిగేడ్ వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలు కేవలం బ్యాటరీ బాక్స్ వరకే పరిమితం కావడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. టెక్నికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యేక యథావిధిగా ట్రైన్ బయల్దేరుతుందని తెలిపారు. అంతకు ముందు వందేభారత్‌ ట్రైన్‌కి వరుస ప్రమాదాలు సంభవించాయి. పట్టాల మీదకు ఆవులు రావడం, వాటిని ట్రైన్‌లు ఢీకొట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకూ దాదాపు 68 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. కొందరు ఆకతాయిలు రాళ్లు విసరడం వల్ల పలు ట్రైన్‌లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. తరవాత వాటిని మరమ్మతు చేసి యథావిధిగా సర్వీస్‌లు కొనసాగించారు.