Kanpur Crime:
కాన్పూర్‌లో ఘటన..
యూపీలోని కాన్పూర్‌లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు ముగ్గురు దుండగులు. ఆ డెడ్ బాడీ ఎవరి కంటా పడకుండా దూరంగా పారేయాలని స్కెచ్ వేసుకున్నారు. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేసుకుని అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.40కోట్ల ఆస్తి కోసం ఇద్దరు మేనల్లుళ్లు మహిళను హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో వ్యక్తి నోయిడా నుంచి మహారాజ్‌పూర్‌కి ఓలా క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ వచ్చి ఇంటి గేట్ ముందు ఆగింది. ఈలోగా హడావుడిగా ఓ గోనె సంచిలో డెడ్‌బాడీని కుక్కారు నిందితులు. వాళ్లు సంచిని తీసుకొచ్చి క్యాబ్ డిక్కీలో పెడుతుండగా డ్రైవర్‌కి అనుమానం వచ్చింది. ఆ సంచిలో నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించాడు. ఈ రైడ్ తీసుకుంటే తానూ చిక్కుల్లో పడతానని భావించిన ఆ డ్రైవర్ వెంటనే వాళ్లను నిలదీశాడు. నిందితులు వాగ్వాదానికి దిగారు. కచ్చితంగా తీసుకెళ్లాల్సిందేనని బెదిరించారు. చాలా సేపు గొడవ పడిన తరవాత ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు డ్రైవర్. హైవేపై ఉన్న పోలీసులకు ఈ సమాచారం అందించాడు. ఆ తరవాత మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విషయమంతా చెప్పాడు. అప్రమత్తమైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అప్పటికే నిందితులు తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన జులై 11న జరిగింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా...మహిళ డెడ్‌బాడీ ఫతేపూర్‌లో దొరికింది. స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం చేయించారు. ఇప్పటికే ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.
Also Read: Pakisthan News: పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాల ధ్వంసం- రాకెట్ లాంచర్లతో దాడి