Pakisthan News: పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో జరిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడి ఓ హిందూ దేవాలయాన్ని ఆదివారం రోజు పలువురు దోపిడీదారులు రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం ఉదయమే అకస్మాత్తుగా రాకెట్లను ప్రయోగించి స్థానికంగా కలకలం సృష్టించారు. అయితే రాకెట్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేవలం హిందూ గుడిపై మాత్రమే కాకుండా మైనార్టీ కమ్యూటినికీ చెందిన ప్రార్థనా స్థలంపై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోర్ ప్రాంతంలో స్థానిక హిందూ సమాజం నిర్మించిన చిన్న దేవాలయంతో పాటు మైనారిటీ కమ్యూనిటీ సభ్యులకు చెందిన పొరుగు ఇళ్లపై దుండగులు దాడికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు.


పోలీసుల రాకను గుర్తించిన దుండగుల పరారు


ఆదివారం రోజు మూసివేసిన ఆలయంపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కాష్మోర్-కంద్‌కోట్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ఎనిమిది లేదా తొమ్మిది మంది ముష్కరుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అంచనా వేశారు. అలాగే రాకెట్ల పేల్చడంలో విఫలం కావడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. బగ్రీ కమ్యూనిటీ నిర్వహించే మతపరమైన సేవల కోసం ఆలయాన్ని సాధారణంగా ప్రతి ఏడాది తెరుస్తారు. 


సీమా హైదర్ బఖ్రానీ ప్రేమతో పెరిగిన దాడులు


పాకిస్థాన్ కు చెందిన వివాహిత సీమా హైదర్ బఖ్రానీ భారత్ లోని ఓ హిందూ వ్యక్తితో ప్రేమలో పడి దేశం విడిచిన విషయం అందరికీ తెలిసిందే. కొవిడ్ ప్యాండెమిక్‌ టైమ్‌లో పబ్‌జీ గేమ్ ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో నేపాల్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. సీమా హైదర్‌కి 30 ఏళ్లు కాగా...యువకుడు సచిన్‌కి 25 ఏళ్లు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని నేపాల్‌లోనే ఒక్కటయ్యారు. ఆ తరవాత నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా ఇండియాకి వచ్చేసింది సీమా. ఈ క్రమంలోనే పాక్ లోని హిందువులపై బెదిరింపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా హిందూ ఆలయాలపై కూడా దాడులు చేస్తున్నారు. కాష్మోర్, ఘోట్కీ నదీతీర ప్రాంతాలలో హిందూ ప్రార్థనా స్థలాలు, కమ్యూనిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు తెగబడుతున్నారు. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) స్పందించింది. సీమా హైదర్ బఖ్రానీ ప్రేమ వల్ల సింధ్‌లోని కాష్మోర్,  ఘోట్కీ జిల్లాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.


శుక్రవారం కూడా మేరి మాత ఆలయంపై దాడి


శుక్రవారం రోజు రాత్రి కూడా కరాచీలోని సోల్జర్ బజార్‌లోని మేరి మాత ఆలయాన్ని ధ్వంసం చేశారు. అయితే ఆలయం మొత్తం నాశనం కావడంతో పోలీసులు కూడా బుల్ డోజర్ల ద్వారా నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. ఈ ఆలయం దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనదని తెలుస్తోంది. కరాచీ అనేక పురాతన హిందూ దేవాలయాలకు నిలయం. అలాగే హిందువులు పాకిస్తాన్‌లో అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు. అక్కడ వారు ముస్లిం నివాసులతో సంస్కృతీ సంప్రదాయాలు, భాషను పంచుకుంటారు.