Amit Shah Gujarat Visit:
గుజరాత్ పర్యటనలో అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగానే అహ్మదాబాద్‌లో తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైందన్న అమిత్ షా...ప్రస్తుతం దేశ స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన స్థితి ఏమీ లేదని వెల్లడించారు. తమకు దేశం కోసం ప్రాణాలర్పించే అవకాశం రాకపోయినా...దేశం కోసం జీవించే అరుదైన అవకాశం లభించిందని తేల్చి చెప్పారు. మాతృభూమి కోసం బతికే తమను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. ప్రతి ఇంట్లోనూ దేశ భక్తి ఉప్పొంగాలని ఆకాంక్షించారు. అందుకే ప్రధాని మోదీ హర్‌ఘర్ తిరంగాతో అందరిలోనూ స్ఫూర్తి రగిలించారని ప్రశంసించారు.
"ప్రస్తుతం మనకు దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించే గొప్ప అవకాశం లేకపోవచ్చు. కానీ దేశం కోసం బతికే అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. దేశవ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగాలన్న కోరికతో ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని పిలుపునిచ్చారు. చిన్నారుల నుంచి యువత వరకూ అందరిలోనూ దేశంపైన మమకారం పెంచాలన్నదే ఆయన లక్ష్యం. ఇవాళ వేలాది మంది ప్రజలు జాతీయ జెండాను పట్టుకుని నినాదాలు చేస్తుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్టే కనిపిస్తోంది"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
హర్ ఘర్ తిరంగా
గతేడాది హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి భారీ స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు అమిత్ షా. దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేసి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారని అన్నారు. మరికొందరు సెల్ఫీలు దిగి మిగతా వాళ్లకూ స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా గుజరాత్‌లోనే కాకుండా దేశమంతా ఇలానే త్రివర్ణ పతాకాలతో నిండిపోవాలని అన్నారు.
ప్రధాని పిలుపు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. గతేడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ పౌరులంతా ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని కోరారు. చాలా మంది దీనికి సానుకూలంగా స్పందించారు. ఇంటిపై జెండా ఎగరేశారు. ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సారి కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని అన్నారు ప్రధాని. దేశంతో ప్రతి ఒక్కరూ అనుబంధాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆగస్టు 13-15 వరకూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పారు. ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు చేశారు. సోషల్ మీడియా అకౌంట్‌లకు డీపీగా త్రివర్ణ పతాకాన్నే పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read: China Engineers: పాక్‌లో చైనా ఇంజనీర్‌ల కాన్వాయ్‌పై దాడి, రెండు గంటల పాటు కాల్పులు