China Engineers Convoy:


గ్వాదర్‌లో దాడి..


పాకిస్థాన్‌లో చైనా దేశస్థులపై దాడులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా బలూచిస్థాన్‌లో తరచూ అలజడి కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరిగింది. బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌లో చైనా ఇంజనీర్‌లకు చెందిన కాన్వాయ్‌పై దాడి కలకలం సృష్టించింది. ఏడు వాహనాల కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. సాయుధ బలగాలు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. ముందు బాంబులతో దాడి చేసిన దుండగులు...ఆ తరవాత కాల్పులు జరిపారు. ఫలితంగా...స్థానికంగా రోడ్‌లన్నీ బ్లాక్ అయ్యాయి. పాక్ ప్రభుత్వ అధికారులు దాడి జరిగినట్టు అధికారికంగా ప్రకటించారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. అయితే..ఎవరు ఈ దాడికి పాల్పడ్డారన్నది మాత్రం ఇంకా నిర్ధరణ కాలేదు. సాయుధ బలగాల పనే అని తెలుస్తున్నా...ఏ సంస్థ అన్నది ఖరారు కాలేదు. ప్రస్తుతానికైతే గ్వాదర్‌ సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ కాల్పులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కాల్పుల శబ్దాలు పెద్దగా వినిపిస్తున్నాయి. వాహనాలు రోడ్‌పైనే నిలిచిపోయాయి. 


పాక్‌ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్..


పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ ఇటీవలే రద్దైంది. ఎన్నికలు జరిగేలోగా ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఎవరు ఉంటారన్న ఉత్కంఠకు తెరపడింది. సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కకర్ (Anwaar-ul-Haq Kakar)ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. నేషనల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అన్వర్‌ నియామకానికి ఆమోదం తెలిపారు. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించిన తరవాత అధికారికంగా అన్వర్ పేరుని ప్రకటించారు. బలూచిస్థాన్‌కి చెందిన అన్వార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేని వ్యక్తిని ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకోవడం కీలకంగా మారింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితిని ఆయన ఎలా డీల్ చేస్తారన్న దానిపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం...ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్నికల బాధ్యత తీసుకుంటారు. 90 రోజుల్లోగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ దిగువ సభ రద్దైన తరవాత కచ్చితంగా మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాలి. ఆ లెక్కన చూసుకుంటే ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశం దాదాపు మునిగిపోయే స్థితిలో ఉంది. ఈ తరుణంలోనే అన్వర్‌కి అదనపు అధికారాలు ఇచ్చే అవకాశాలున్నాయి.